రామ్ తన ఇంట్లో టీవీలో 'టామ్ అండ్ జెర్రీ' చూస్తూ నవ్వుకుంటున్నాడు. అప్పుడే మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళ నాన్నగారు, రామ్ పక్కనే సోఫాలో కూర్చున్నారు. "రేయ్ రామూ... కాస్త ఆ పెన్నూ, పేపరూ తీసుకురారా," అని అడిగారు.
రామ్ విసుగ్గా లేచి వాటిని తెచ్చి ఇచ్చి, మళ్లీ టీవీలో లీనమైపోయాడు. ఇంతలో సుశాంత్ నుంచి ఫోన్.
"రేయ్ రామూ... ప్రజ్ఞ శివాలయానికి రామందిరా. నేనొక్కడినే ఎలా వెళ్తాను? నువ్వు కూడా రారా తోడుగా," బతిమాలాడు సుశాంత్.
"రేయ్... అసలు ఆ గుడికి వెళ్లే ముఖాలేనా మనవి? నేను రాను రా బాబూ. నీ పిల్లతో నువ్వే వెళ్లి అభిషేకం చేసుకో, నన్నెందుకు మధ్యలోకి లాగుతావ్?" చిరాకు పడ్డాడు రామ్.
"సర్లే... నువ్వు రానంటే నేనేం ఫోర్స్ చేయనులే," అంటూ నిరాశగా కాల్ కట్ చేశాడు సుశాంత్.
ఈలోపు వెనకనుంచి రామ్ వాళ్ళ నాన్నగారు పిలిచారు. "రేయ్ బాబూ... ఈ వడ్డీ లెక్క తేలట్లేదు. కాస్త ఆ టీవీ ఆపేసి, నువ్వు కొంచెం సహాయం చేయొచ్చుగా!"
"సరే నాన్న, ఆ పెన్ పేపర్ ఇలా ఇవ్వు," అంటూ నాన్న పక్కన కూర్చున్నాడు.
"12,500... ప్లస్ 24,000... ప్లస్ 5000... మైనస్ 23,000... ఎంతైందిరా?" నాన్న అడిగాడు.
రామ్ వేళ్ల మీద లెక్కపెట్టి "18,000 నాన్న!" అని టక్కున చెప్పాడు.
"గుడ్! అయితే ఆ పద్దెనిమిది వేలనీ ఆరుగురికి సమానంగా పంచు, ఒక్కొక్కరికి ఎంతొస్తుందో చెప్పు," నాన్న అడిగేసరికి రామ్ కి చెమటలు పట్టాయి. డివిజన్స్ రాక నెమ్మదిగా జేబులోంచి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాడు.
అది చూసిన వాళ్ళ నాన్నకి మండిపోయింది. "ఏంట్రా బాబూ? అసలు మూడో తరగతి ఎలా పాసయ్యావ్ నువ్వు? సర్లే, ముందు యూట్యూబ్ లో చూసి లెక్కలు నేర్చుకో... లేకపోతే రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి కూడా ముఖం మీద 'తూ' అని ఊస్తుంది," అంటూ తిట్టిపోశాడు.
పరువు పోతుండటంతో రామ్ వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. "నాన్న, అలా కాదు... సుశాంత్ గాడు ఫోన్ చేశాడు. నాకు ఈ లెక్క వచ్చు. కానీ, వాడు పొద్దుపొద్దున్నే ఫోన్ చేశాడంటే వాడికిదో అర్జెంట్ పని అయ్యుంటుంది పాపం... నేను వెళ్ళాలి," అంటూ హడావిడిగా ఇంట్లో నుంచి బయటపడ్డాడు. బయటకెళ్ళగానే సుశాంత్ కి ఫోన్ చేసి "రేయ్... వస్తున్నారా!" అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు.
"హ్మ్... నా కొడుకు... నా కర్మ రా దేవుడా!" అంటూ తలపట్టుకున్నాడు రామ్ వాళ్ళ నాన్న.
మరోవైపు గుడి దగ్గర సుశాంత్ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ప్రజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాడు. 'దేవుడా, ఎలాగైనా ప్రజ్ఞ వచ్చేలా చూడు స్వామీ,' అని మనసులో దణ్ణం పెట్టుకుంటుండగానే రామ్ వచ్చాడు.
"రేయ్! గుడికి అని క్లారిటీగా చెప్పొచ్చు కదరా ముందే?" అని వస్తూనే అడిగాడు రామ్.
"నా బతుకు నువ్వొకడివి రా బాబూ. అసలే ప్రజ్ఞ ఇంకా రాలేదని నేను టెన్షన్ లో ఉంటే," విసుక్కున్నాడు సుశాంత్.
రామ్ నవ్వి, "నాకు తెలుసురా. ఈ లవ్, కొవ్వు నీకు సెట్ అవ్వవని..." అని ఎగతాళి చేశాడు.
"నీ మొహానికి మ్యాథ్స్ సెట్ అయ్యిందా ఏంటి?" కౌంటర్ ఇచ్చాడు సుశాంత్.
"రేయ్... మా బాబు అప్పుడే నీకు చెప్పేశాడా?" రామ్ ఆశ్చర్యపోతుండగానే, అక్కడికి ప్రజ్ఞ వచ్చింది.
"ఏంటి సుశాంత్ గారు... గుడికి వచ్చి కనీసం కొబ్బరికాయ కూడా తెచ్చుకోలేదా?" అని చిరునవ్వుతో అడిగింది ప్రజ్ఞ.
వెంటనే రామ్, "డబ్బుల్లేక..." అని నోరుజారబోతుండగా, సుశాంత్ వాడి కాలు గట్టిగా తొక్కాడు.
నొప్పిని కవర్ చేసుకుంటూ "జస్ట్ ఇందాకే కొట్టేశామండీ... పదండి దర్శనం చేసుకుందాం," అన్నాడు సుశాంత్.
"హా, రండి. ప్రదక్షిణ చేద్దాం," అంటూ ముగ్గురూ కలిసి గుడి చుట్టూ తిరిగారు. దర్శనం సమయంలో ప్రజ్ఞ కళ్ళు మూసుకుని భక్తిగా దండం పెట్టుకుంటుంటే... సుశాంత్ మాత్రం కన్నార్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.
పక్కనే ఉన్న రామ్ వాడిని మోచేత్తో పొడిచి, "మాస్టారూ... ఇది గుడి. టెంపుల్!" అని గుసగుసగా గుర్తుచేశాడు.
"నువ్వు కాసేపు పక్కకెళ్లి చావొచ్చుగా!" పళ్లు కొరుకుతూ అన్నాడు సుశాంత్.
దర్శనం పూర్తయ్యాక ప్రజ్ఞతో కలిసి గుడి ప్రాంగణంలో ఓ పక్కన కూర్చున్నాడు సుశాంత్. చుట్టూ చూసిన ప్రజ్ఞ "ఏంటి, రామ్ కనిపించట్లేదు?" అని అడిగింది.
సుశాంత్ కి ఏం చెప్పాలో తోచక, "వాడికి లూజ్ మోషన్స్ అంట... అందుకే టాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్ కి వెళ్ళాడు," అని అబద్ధం ఆడాడు.
సుశాంత్ కాస్త తడబడుతూ... "ఇలా అంటున్నానని ఏమనుకోకు. మనం కొంచెం... అంటే... ఫ్రెండ్సా? లేదా..." అని ఆగిపోయాడు.
"హ్మ్... నీకేమనిపిస్తోంది?" ప్రజ్ఞ సూటిగా అడిగింది. కానీ సుశాంత్ ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోయాడు.
అప్పుడు ప్రజ్ఞే చొరవ తీసుకుని, సుశాంత్ చేయిని తన చేతుల్లోకి తీసుకుంది. "నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేశావ్. కానీ మా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. నీకు ఒక జాబ్ కూడా లేదు... ఇక మన పెళ్లికి మా వాళ్ళు..." అంటూ ప్రజ్ఞ గొంతులో సన్నని వణుకు మొదలైంది.
వెంటనే సుశాంత్ ఆమె చేయిని గట్టిగా పట్టుకుని భరోసాగా చూశాడు. "ఇంతేనా? నేను మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్ తోనే ఈ బ్యాండ్ లో ఉన్నాను కానీ, జాబ్ తెచ్చుకోలేక కాదు," అన్నాడు నమ్మకంగా.
ఆ మాటలకు ప్రజ్ఞ వాడి కళ్లల్లోకే చూస్తూ ఉండిపోయింది. సుశాంత్ నెమ్మదిగా ఆమె కురులను సరిచేసి, కాస్త దగ్గరగా జరిగాడు. ఆ అందమైన క్షణంలో... సడన్ గా అక్కడికి ఊడిపడ్డాడు రామ్.
"రేయ్ మామా... తీసుకోండి ప్రసాదం! మనం ముగ్గురం ఉన్నామంటే ఆ పంతులు నమ్మలేదు, అందుకే మూడుసార్లు లైన్ లోకి వెళ్లి మరీ తెచ్చా," అంటూ ఆపసోపాలు పడుతూ వచ్చాడు.
చిరాకుతో సుశాంత్ వెంటనే ప్రజ్ఞ చేతిని వదిలేశాడు. "రా నాన్నా రా... ప్రసాదమా? ఇలా ఇవ్వు... మేం తినిపెడతాంలే," అంటూ కోపాన్ని అణుచుకున్నాడు.
ప్రజ్ఞ నెమ్మదిగా లేచి నిలబడుతూ, "ఏంటో, మోషన్స్ తో టెంపుల్ కి ఎందుకు రావడం అన్నయ్యా? ప్రసాదం కావాలంటే మీ సుశాంత్ తీసుకువస్తాడుగా... జాగ్రత్తగా ఇంటికెళ్ళు," అని నవ్వుతూ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
రామ్ కి ఏమీ అర్థం కాలేదు. "మోషన్సా? నాకా? రేయ్ సుశాంత్... నువ్వేం చెప్పావురా నా గురించి?" అంటూ సుశాంత్ వెంట పడ్డాడు.