ఫోన్ స్క్రీన్ మీద జయ పేరు చూడగానే నాని మనసులోని దుఃఖం అంతా ఆవిరైపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో... చెప్పండి, ఏంటిలా సడన్‌గా ఫోన్ చేశారు?” అని అడిగాడు.
అవతలి వైపు నుంచి జయ, “‘అండీ’ అనొద్దు అని ముందే చెప్పానుగా! నేను ఇంకా చిన్నపిల్లనే,” అని ముద్దుగా కోప్పడింది.
ఆ మాటలు నానికి ఎంతో కొత్తగా అనిపించాయి. మన కోసం ఎవరైనా సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే మనసు ఎంతో కుదుటపడుతుంది. ఇప్పుడు నాని కూడా సరిగ్గా అలాగే ఫీల్ అవుతున్నాడు.
“ఏంటి, నువ్వు చిన్నపిల్లవా? అబ్బో నమ్మేశాల్లే,” అన్నాడు నాని నవ్వుతూ.
అంతలో జయ వెనక నుంచి వాళ్ల నాన్న గొంతు వినిపించింది. “అమ్మా అను, రేపు ఏ టైమ్‌కి వెళ్తారు గుడికి?” అని అడిగాడు.
జయ వెంటనే, “ఉదయం ఎనిమిది గంటలకి నాన్నా,” అని బదులిచ్చింది.
సత్యరాజు ఆమె దగ్గరికి వచ్చి, “ఇంతకీ ఏ గుడికమ్మా?” అని అడిగాడు.
దానికి జయ కంగారుగా, “అబ్బా… మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా నాన్నా... నీకు అవన్నీ తర్వాత చెప్తాలే, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా!” అని నాన్నను పంపించేసింది.
జయ వాళ్ల నాన్నతో అంత ఫ్రీగా, సరదాగా ఉండటం చూసి నానికి ఆశ్చర్యం వేసింది.
“ఏంటి జయా? మీ వాళ్లందరూ అక్కడే ఉన్నారా? వాళ్లు ఉండగానే నాతో మాట్లాడుతున్నావా?” అని అడిగాడు.
దానికి జయ ఏమాత్రం తడబడకుండా, “దాక్కొని మాట్లాడటానికి నేనేమైనా తప్పు చేస్తున్నానా ఏంటి? అయినా మా వాళ్లకి నా మీద చాలా నమ్మకం! అదీ ఇక్కడ నా వాల్యూ,” అని తన గొప్పలు చెప్పుకుంది.
అది విన్న నాని నవ్వి, “నీ పనే బాగుందిలే… ఎంజాయ్,” అన్నాడు.
అప్పుడు జయ, “సరే, మా నాన్న నాకోసం వేడి వేడి పరోటాలు తెచ్చాడు. నేను నీతో తర్వాత మాట్లాడతా!” అంది.
“సరే,” అని నాని కాల్ కట్ చేయబోతుంటే—
“ఓయ్! రేపు సాయంత్రం నేనే మళ్లీ కాల్ చేస్తా. నువ్వు మాత్రం అస్సలు చేయకు… ఒకవేళ మా అమ్మ అటెండ్ చేస్తే అంతే సంగతులు!” అని హెచ్చరించింది జయ.
“సరేలే మేడమ్, మీరు ఎలా చెప్తే అలా,” అన్నాడు నాని. జయ కాల్ కట్ చేసింది.
పాపం నానికి మాత్రం జయతో ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తోంది. రెండు చేతులూ ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని, దారిలో ఉన్న రాయిని తన్నుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.
“అసలు నాకెందుకు ఫోన్ చేసింది? ఏం మాట్లాడింది? ఇలా చేసి అలా కట్ చేసేసిందేంటి…” అని తనలో తానే గొణుక్కుంటున్నాడు. అప్పుడే నానికి, జయ వాళ్ల నాన్నతో చెప్పిన గుడి మాటలు గుర్తొచ్చాయి.
వెంటనే తన ఫ్రెండ్ తేజకి ఫోన్ చేశాడు.
“రేయ్ తేజా! ఎక్కడున్నావురా? ఒక ఇంపార్టెంట్ పని పడింది,” అన్నాడు.
అవతలి వైపు నుంచి తేజ గట్టిగా నిట్టూరుస్తూ... “దేవుడా… సరే చెప్పు, ఏంటి విషయం?” అని విసుక్కున్నాడు.
“రేయ్, అర్జెంట్‌గా మా ఇంటికి వచ్చేయ్. రేపు ఉదయం మనం గుడికి వెళ్తున్నాం,” అన్నాడు నాని.
అది వినగానే తేజకి మండిపోయింది. “ఒరేయ్ నీకు పుణ్యం ఉంటుందిరా! ఇప్పుడే మా ఊరికి వెళ్లడానికి బస్ టికెట్ బుక్ చేసుకుందామనుకున్నా… మళ్లీ ఈ గుడి గోల ఏంట్రా మధ్యలో! భలే ఫిట్టింగ్ పెట్టావు కదరా,” అని అరిచాడు.
నాని బ్రతిమిలాడుతూ, “అలా కాదురా తేజా. జయ కూడా అక్కడికి వస్తోంది. మనం వెళ్తే తనని చూడొచ్చు. ప్లీజ్ మావా… నాకంటూ నువ్వు కాకపోతే ఎవరున్నారు చెప్పు… వెనక్కి వచ్చేయ్ రా,” అని అడిగాడు.
“నీ బోడి వన్ సైడ్ లవ్ కోసం నేను మా ఇంటికి వెళ్లకూడదారా?” అని ఎదురుప్రశ్న వేశాడు తేజ.
అప్పుడు నాని సెంటిమెంట్ అస్త్రం తీశాడు. “రేయ్… ఎనిమిది నెలల క్రితం ‘అన్నా, ఆకలిగా ఉంది’ అని నువ్వు అన్నప్పుడు, నా దగ్గరున్న ఐదు రూపాయలతో గుడ్ డే (Good Day) బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి నీ ఆకలి తీర్చాను కదరా! ఇదేనా నువ్వు మన 50-50 ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే వాల్యూ?” అని డైలాగ్ కొట్టాడు.
దానికి తేజ ఏమాత్రం తగ్గకుండా, “కావాలంటే రేపు నీకు యాభై రూపాయల కిండర్ జాయ్ (Kinder Joy) కొనిస్తా… నన్ను వదిలేయ్ రా బాబూ!” అని చెప్పి టప్ మని కాల్ కట్ చేశాడు.
“ఛీ… ఈమధ్య ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ లేకుండా పోతోంది. ఊళ్లో వీడెవరో గుంటని పట్టినట్టున్నాడు… యాదవ!” అని వెటకారంగా తిట్టుకున్నాడు నాని.
మరుసటి రోజు ఉదయం:
అందరికన్నా ముందే గుడికి చేరుకున్నాడు నాని. జయ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. అతగాడి చూపులు చూసి గుడికి వచ్చే భక్తులంతా నానిని వింతగా చూడటం మొదలుపెట్టారు.
కొంతసేపటికి అక్కడికి జయ వాళ్ల నాన్న, వైష్ణవి, జయ (అను) కలిసి వచ్చారు. వాళ్లతో పాటు ఆ చిన్న పాప (రాజమాత) కూడా ఉంది.
అక్కడ నానిని చూసి జయ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
‘అమ్మ దొంగ… పెద్ద ప్లానే వేశాడు!’ అని మనసులో అనుకుని నవ్వింది. వెంటనే తేరుకుని, “నాన్నా, నేను, జయ (చిన్న పాప) కలిసి కొబ్బరికాయలు కొనుక్కుని వస్తాం. నువ్వు వైష్ణవితో లోపలికి వెళ్లు,” అని చెప్పింది.
తనకోసమే ఎదురుచూస్తున్న నాని వైపు చూస్తూ, కొబ్బరికాయలు కొంటూ అతన్ని గమనిస్తోంది జయ. పక్కన ఉన్న అరటిగెల నుంచి ఒక పండు తీసుకుని, ఆ చిన్న పాపతో ఏదో గుసగుసలాడి, ఆమెను నాని దగ్గరికి పంపించింది.
మరోవైపు నాని కళ్లు మాత్రం గేటు వైపే చూస్తున్నాయి. జయ వాళ్ల నాన్న పక్కన ఉన్న వైష్ణవిని చూసి ‘ఈ అమ్మాయే జయనేమో’ అని పొరబడి, వాళ్లని ఫాలో అవ్వబోయాడు నాని.
అది దూరం నుంచి చూసిన అను (జయ) ‘అయ్యో దేవుడా 🤦🏻♀️’ అని తల బాదుకుంది.
సరిగ్గా అప్పుడే మన రాజమాత (చిన్న పాప) నానిని పిలిచింది.
“ఎవరు?” అని నాని చుట్టూ వెతికాడు. కానీ ఆ పాప కింద నిలబడి నాని ప్యాంట్ లాగుతోంది. కిందకి చూసిన నాని, “ఓయ్, నువ్వా!” అన్నాడు ఆశ్చర్యంగా.
అప్పుడు ఆ పాప చేతిలో ఉన్న అరటిపండు నాని చేతిలో పెట్టి... “అవును నేనే! ఏంటి, ఏదో సరదాగా ఫోన్ చేస్తే నిజంగానే వచ్చేస్తావా? ఛీ ఛీ! ముందు ఈ బనానా తీసుకుని ఇంటికి వెళ్లిపో. సాయంత్రం నేనే ఫోన్ చేస్తాలే,” అని పెద్దరికంతో చెప్పి అక్కడి నుంచి పరుగెత్తింది.
నానికి అక్కడ ఏం జరుగుతుందో, అసలు జయ ఎవరో అర్థం కాక బుర్ర హీటెక్కిపోయింది.
“జయా… నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. నీ సంగతి తర్వాత చెప్తా,” అని గొణుక్కుంటూ, తన చేతిలో ఉన్న అరటిపండును పక్కనే ఉన్న బిచ్చగాడికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దూరం నుంచి అదంతా చూస్తున్న జయ, ‘పాపం… బాగా ఫీల్ అయినట్టున్నాడు. సరేలే సాయంత్రం ఫోన్ చేద్దాం,’ అనుకుంటూ వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లిపోయింది.