ఏదోలా మీనాక్షి నుండి తప్పించుకుని వెళ్లిన శ్యామ్‌కి తెలియని విషయం ఏంటంటే, అతని మేనమామ వాళ్లని చూసాడు. కానీ అతను దూరం నుండి చూడడం వల్ల అతనికి ఎలా అర్థం అయ్యిందో ఏంటో.
శ్యామ్ ప్రేమ్‌ని కూడా తీసుకుని వెళ్లాడు. అలా వెళ్లే దారిలో శ్యామ్ వాళ్ల మరదలితో జరిగిన సంఘటనని ప్రేమ్‌కి చెప్పాడు. అప్పుడు అది అంతా విన్న ప్రేమ్:
> "అయితే మంచి విషయమే కదరా... మీనాక్షి చూడడానికి చాలా అందంగా, లక్షణంగా ఉంటుంది. పైగా మీ మేనమామ నువ్వు ఎంత దరిద్రంగా బుక్ రాసినా పబ్లిష్ చేసేస్తాడు... అల్లుడు అనే హోదా వస్తుంది కదా..."
అని సలహా ఇచ్చాడు.
కానీ శ్యామ్ ఇలా అన్నాడు:
> "ఇంకోసారి ఇలాంటి వెధవ సలహా ఇవ్వకు..."
అని కొంచెం కోపంగా అన్నాడు.
శ్యామ్ రుక్మిణి కోసం తన కాలేజీ గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. ప్రేమ్ కూడా అక్కడ పక్కనే కూర్చున్నాడు. కానీ శ్యామ్ మాత్రం నిలబడి రుక్మిణి కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎంతసేపు అయినా ఇంకా రాలేదు రుక్మిణి.
పక్కనుండి ప్రేమ్:
> "ఒరేయ్... నువ్వు ఏమి అనుకోను అంటే నీకో విషయం చెప్పాలి... నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి!"
అని అంటాడు.
అప్పుడు చిరాకుతో శ్యామ్:
> "ఏంటో అడుగు."
అని అన్నాడు.
అప్పుడు ప్రేమ్:
> "అసలు ఆ అమ్మాయి ఎలా నచ్చింది రా నీకు? ఆ కళ్లద్దాలు తీసేస్తే నువ్వు సరిగా కనిపిస్తావో లేదో... ఆ అమ్మాయిలో ఏం నచ్చింది అని రా ఇంతలా వెనక తిరుగుతున్నావ్?"
అని అడిగాడు.
అంతా చిరాకులో కూడా ప్రేమ్ ప్రశ్నకి చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు శ్యామ్:
> "ఏమో రా నాకు తెలియదు... నాకు రుక్మిణి అంటే ఎందుకో చాలా ఇష్టం. తను పక్కన ఉంటే ఏదో తెలియని..."
అని ఒక క్షణం ఆగి,
> "అసలు ఏం అని చెప్పాలో, ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు..."
అని అన్నాడు శ్యామ్.
అది విన్న ప్రేమ్:
> "సరే! నిన్ను పొగుడుతున్నానని కాదు కానీ, ఆ రాముడిలో ఉన్న అన్ని మంచి గుణాలు నీలో ఉన్నాయి రా... నువ్వు కథలు బాగా రాసి పబ్లిష్ చేసావే అనుకో! రుక్మిణిలాంటి అమ్మాయిలు చాలా మంది వస్తారు... అయినా సీతలాంటి మీనాక్షిని అలా ఎలా వదులుకుంటావ్?"
అని అన్నాడు.
ఈ మాటలు విన్న శ్యామ్‌కి చాలా కోపం వచ్చింది. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకుని ఇలా సమాధానం ఇచ్చాడు:
> "నేను నిజంగా రాముడిని అయితే రుక్మిణి తప్ప ఇంకెవరూ సీతగా వద్దు... రుక్మిణి ఏంటో నాకు మాత్రమే తెలుసు..."
అని అన్నాడు.
అలా అనేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రుక్మిణి తన క్లాస్‌లోకి వెళ్లిపోతూ కనిపించింది.
> "రుక్మిణిలా ఉంది ఏంటి?... నియబ్బా! పిచ్చి questions వేసి నా ఫోకస్ పాడుచేశావ్ కదరా!"
అని అరిచాడు ప్రేమ్ మీద.
అప్పుడు ప్రేమ్:
> "అవును అవును... ఈ ఫోకస్ ఏదో ఆ బుక్ మీద పెట్టి ఉంటే ఈపాటికి మరో రవీంద్రనాథ్ ఠాగూర్ అయ్యేవాడివి..."
అని చిన్నగా అంటాడు.
శ్యామ్ రుక్మిణి కోసం తన క్లాస్ దాకా వెళ్లేసరికి అక్కడే ఉన్న ఒక watchman శ్యామ్‌ని ఆపి బయటకి పోమనాడు.
ఏం చేయాలో అర్థం కాలేదు శ్యామ్‌కి.
అప్పుడు బాగా ఆలోచిస్తే దూరంగా పల్లీలు నములుతున్న ప్రేమ్ కనిపించాడు. శ్యామ్‌కి ఒక ఆలోచన వచ్చింది.
రుక్మిణి వాళ్ల క్లాస్ వెనకనున్న గోడ పైకి ఎక్కి, ప్రేమ్‌ని కింద వంగోమన్నాడు.
పాపం క్లాస్‌లో కూర్చున్న రుక్మిణి పక్కనే ఉన్న కిటికీలోంచి ఏవో చేతులు పైకి రావడం చూసి గట్టిగా అరిచేసింది.
క్లాస్‌లో అందరూ రుక్మిణినే చూశారు.
> "షూ... షూ... అరవకండి నేనే నేనే..."
అని అన్నాడు శ్యామ్.
రుక్మిణి:
> "పుస్తకం కోసం ఇక్కడిదాకా వచ్చేస్తారా?"
అని మెల్లిగా అంది.
కానీ శ్యామ్‌ని మోయలేక పడేశాడు ప్రేమ్.
> "అయ్యో..."
అని కంగారుగా రుక్మిణి కిందకి పరుగులు తీసింది గబగబా.
కిందకి వెళ్లగానే శ్యామ్‌కి చిన్నగా దెబ్బలు తగిలాయని గమనించింది రుక్మిణి.
> "ఏంటి... ఏం అనుకుంటున్నారు మీరు? సర్కస్‌లో కోతిలాగా... అవసరమా అలా ఎక్కడం? ఏమైనా అయ్యి ఉంటే?"
అని కంగారు కంగారుగా తిడుతుంటే శ్యామ్ మాత్రం నవ్వుతున్నాడు.
> "ఏంటి నవ్వుతున్నారు శ్యామ్ గారు???"
అని అంది రుక్మిణి.
అదే మొదటిసారి రుక్మిణి శ్యామ్‌ని పేరు పెట్టి పిలవడం!!
ఆ పిలుపు శ్యామ్‌కి ఎంతో నచ్చింది.
శ్యామ్:
> "రుక్మిణి గారు... కొంచెం మాట్లాడాలి..."
అని అన్నాడు.
అప్పుడు రుక్మిణి అటు ఇటు చూసి:
> "సరే... మనం గ్రౌండ్‌లోకి వెళ్లి మాట్లాడుకుందాం."
అని చెప్పి గ్రౌండ్ పక్కన ఉన్న చిన్న గార్డెన్ దగ్గరకి తీసుకెళ్లింది.
అక్కడ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.
అప్పుడు శ్యామ్:
> "అది ఏం లేదు... ముందు మాట రాసావో లేదో అని..."
అని అంటాడు.
అప్పుడు రుక్మిణి:
> "అంటే... ఏం అంటే... నేను... నేను అది ఇంకా రాయలేదు శ్యామ్ గారు... నేను మీ పుస్తకం మొత్తం చదివేసరికే నిద్ర వచ్చేసింది. రేపు తప్పకుండా రాసి ఇచ్చేస్తా!!"
అని అంది.
అది విన్న ప్రేమ్ గట్టిగా పగలబడి నవ్వుకున్నాడు.
> "సీతా... హ హ... నిద్ర పోయింది నీ సీతా..."
అని నవ్వుకున్నాడు.
అప్పుడు శ్యామ్:
> "రే నువ్వు కాసేపు పక్కకి పోరా!"
అని తిట్టి పంపేశాడు ప్రేమ్‌ని మన శ్యామ్.
> "అది ఏంటి అండి అలా అనేశారు..."
అని అన్నాడు శ్యామ్.
అప్పుడు రుక్మిణి:
> "అలా అని కాదు కానీ, మామూలు కథల పుస్తకాలు ప్రతి ఒక్కరూ రాస్తారు. అందులో గొప్ప ఏం ఉంది? మీరు అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తేనే కదా కొత్తదనం. అందుకని అలా అన్నాను.
> మీకు మన సమాజంలో జరిగేవి, అలాగే ఆడపిల్లల కోసం... చిన్నతనంలోనే చాలా మందికి పెళ్లిళ్లు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆడపిల్లని భారంగా చూసే తల్లితండ్రులు కూడా ఉన్నారు... నేను చూసాను.
> నాకు అయితే స్వేచ్ఛ లేదు అనుకోండి, అది వేరే విషయం..."
అని దీర్ఘంగా చెప్పింది. కానీ చాలా నిజాయతీగా చెప్పింది.
ఇక్కడ మన రుక్మిణి శ్యామ్‌ని మెరుగుపరచాలని చూస్తుంది. శ్యామ్‌ని తక్కువ చేయకుండా, ఇప్పటివరకు అసలు శ్యామ్ ఆలోచించని విషయాలపై ఆలోచించేలా చేసింది రుక్మిణి.
రుక్మిణి:
> "ఇంకా చెప్పాలి అంటే నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే ప్రాణం. కానీ మా అమ్మ ఒప్పుకోదు... ఏం చేస్తాం, పెద్దవాళ్ల మాట కాదు అనకూడదు కదా...
> నేను కూడా మీలా రైటర్ అయ్యుంటే బాగుండు... ఇలాంటివన్నీ రాసి సమాజాన్ని మార్చేస్తా!"
అని ఎంతో గొప్పగా చెప్పింది.
ఆ మాటలు విన్న శ్యామ్‌కి అర్థమైంది — అసలు శ్యామ్ ఇప్పటివరకు ఒక రైటరే కాదు అని...
నిజమైన రైటర్ అంటే ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు శ్యామ్ మనసులో ఉంది.
శ్యామ్:
> "మీరు కూడా ఒక పుస్తకం రాయండి. నా ఆలోచన కన్నా మీ ఆలోచన చాలా బాగుంది. మీరు రాసే పుస్తకానికి నేను ముందు మాట రాస్తాను."
అని చిన్నగా నవ్వి అక్కడి నుండి పైకి లేచాడు.
అప్పుడు రుక్మిణి:
> "శ్యామ్ గారు... నేను నా ఉద్దేశం మాత్రమే చెప్పా. ఈ పుస్తకానికి నేను ముందు మాట రాసి మీకు కచ్చితంగా రేపు ఇస్తాను... రేపు వెంకటేశ్వర స్వామి గుడికి రండి. అదే ఆరోజు వచ్చారు కదా!"
అని చెప్పింది రుక్మిణి.
అప్పుడు శ్యామ్:
> "సరే అండి... రేపు కలుద్దాం అయితే."
అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
రుక్మిణి:
> "నేను సొంతంగా ఒక పుస్తకం రాయగలను అంటావా?"
అని తనలో తాను అనుకుంది.