నాని తన గదిలోని గోడకున్న క్యాలెండర్‌ను అదేపనిగా చూస్తున్నాడు. అప్పుడే వాళ్ల అమ్మమ్మ చేతిలో పాల గ్లాసుతో వచ్చి, "నిన్న వెళ్లిన పని ఏమైందిరా?" అని అడిగింది.
అదే గదిలో ఉన్న వాళ్ల తాతయ్య పేపర్ చదువుతున్నట్టు నటిస్తూనే, వాళ్ల మాటల మీద ఒక చెవి వేశాడు.
నాని నిరాశగా, "ఏముందమ్మా… నాకు వెళ్లడం కుదరలేదు. అయినా పిన్నికి బాగోలేదని తెలిసేసరికి ఎందుకో వెళ్లాలనిపించి, అర్జెంట్‌గా వెళ్లిపోయాను," అన్నాడు.
దానికి అమ్మమ్మ, "అవునులే గానీ, ఆ పనేదో చూసుకుని రాత్రికి వెళ్లొచ్చు కదరా!" అని అడిగింది.
నాని ఒక్క నిమిషం ఆగి, 'అవును కదా, నిజమే!' అని మనసులో అనుకున్నాడు.
వెనక నుంచి వాళ్ల తాతయ్య, 'నా పోలిక ఒక్కటి కూడా రాలేదు యాదవకి! చ్ చ్! వేస్ట్ గాడు… అదే నేనైతేనా!' అని మనసులో తిట్టుకున్నాడు.
ఆయన మనసులో అనుకున్నా సరే, ఆ ఫీలింగ్ వాళ్ల ఆవిడకి ఇట్టే అర్థమైపోయి కాస్త సీరియస్‌గా చూసింది. అంతే, తాతయ్య కవర్ చేసుకుంటూ మళ్లీ పేపర్ అడ్డం పెట్టుకుని చదువుతున్నట్టు నటించడం మొదలుపెట్టాడు.
నాని ఆ క్యాలెండర్‌లో వచ్చే ఆదివారం వైపు చూసి, "ఏది ఏమైనా సరే… ఈ ఆదివారం కచ్చితంగా తనని కలవాలి," అని ఫిక్స్ అయ్యాడు. కానీ సరిగ్గా అదే క్యాలెండర్‌లో 26వ తారీఖున 'శ్రీకృష్ణ జన్మాష్టమి' అని రాసి ఉంది…
చూస్తుండగానే రోజులు గడిచాయి. ఆదివారం రానే వచ్చింది.
నాని అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుండగా ఫోన్ మోగింది. జయ దగ్గరి నుంచి మెసేజ్!
"ఇస్కాన్ టెంపుల్ (ISKCON Temple) దగ్గర కలుద్దాం," అని ఉంది అందులో.
అది చూసిన నాని ఎంతో ఎక్సైట్ అవుతూ, "ఓకే యార్ (Ok yaar)" అని రిప్లై ఇచ్చి హుషారుగా బయల్దేరాడు.
కానీ ఈసారి విధి మరో విచిత్రమైన నాటకం ఆడింది…
వార్తల్లో తుఫాన్ హెచ్చరికలు రావడంతో జయను వాళ్ల అమ్మ బయటకు వెళ్లనివ్వలేదు. వాళ్ల ప్రాంతంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ, జయ వెళ్తామన్న ఇస్కాన్ టెంపుల్ గోదావరి ఒడ్డున ఉండటంతో ఆవిడ ససేమిరా అంది.
దీంతో జయకి నానితో ఏం చెప్పాలో అర్థం కాలేదు.
మరోవైపు నాని వస్తుండగా దారిలోనే పెద్ద వర్షం మొదలైంది. నాని బైక్‌ని పక్కన ఆపి, జయకి ఫోన్ చేశాడు.
జయ బాధగా, "నానీ, ఇక్కడ వాతావరణం అస్సలు బాగోలేదు. నేను రావడానికి చాలా ట్రై చేశాను, కానీ అమ్మ అస్సలు వెళ్లనివ్వడం లేదు. సారీ నానీ… నేను నిజంగా రావాలనుకున్నాను," అంది.
దానికి నాని సర్దిచెబుతూ, "సరే సరే, నాకు అర్థమైందిలే. నువ్వేం ఓవర్‌గా థింక్ చేయకు. ఎలాగూ నెక్స్ట్ సండే ఉంది కదా, పర్వాలేదులే. నేను దారిలోనే ఉన్నాను, వెనక్కి వెళ్లిపోతాను," అన్నాడు.
అప్పుడు జయ, "అలా కాదు నానీ… అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ మేమంతా కలిసి నడుచుకుంటూ ఒక గుడికి వెళ్తున్నాం — సుమారు 14 కిలోమీటర్లు. ఆ తర్వాత వారం కూడా నాకు కుదరదు," అంది.
నాని ఆశ్చర్యంగా, "పిచ్చా మీకేమైనా? అంత దూరం ఎలా నడుస్తావ్? అసలే బక్కగా ఉంటావు. ఇప్పుడు ఈ టెంపుల్ రన్ అవసరమా నీకు?" అని అడిగాడు.
"ఏం చేస్తాం చెప్పు… నేను వెళ్లాల్సిందే," అంది జయ.
"సరే, మరి ఆ పై వచ్చే వారం (మూడో వారం) ఎందుకు కుదరదు నీకు?" అని అడిగాడు నాని.
దానికి జయ కాస్త ఇబ్బందిగా, "అమ్మాయిలు 'కుదరదు' అన్నారంటే 'కుదరదు' అని అర్థం చేసుకో," అని సున్నితంగా చెప్పింది.
అప్పుడు నానికి అసలు విషయం అర్థమైంది. "ఓకే ఓకే, అర్థమైందిలే. అంటే మొత్తానికి నాలుగు సార్లు మన మీటింగ్ కాన్సిల్ అయినట్టే కదా! మరి ఇంకెప్పుడు కలుసుకుందాం?" అని అడిగాడు.
నాని నవ్వుతూ, "బహుశా మనం ఆ రోజే కలవాలని రాసిపెట్టి ఉందేమో! ఇదంతా డెస్టినీ (Destiny)… మనం మాత్రం ఏం చేయగలం లే," అన్నాడు.
అప్పుడు జయ, "నాకు నిజంగా నిన్ను కలవాలని ఉంది నానీ. ఆ రోజు నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ని తీసుకుని వస్తాను. నువ్వు కూడా ఇంకో ఇద్దరిని తీసుకుని రా. అయినా ఆ రోజు మనం నిజంగా కలుసుకుంటామో లేదో… ప్రతీసారీ మోయే మోయే (Moye Moye) అవుతోంది," అని మీమ్ లాంగ్వేజ్‌లో జోక్ చేసింది.
నాని దానికి కౌంటర్ ఇస్తూ, "నేనేమన్నా పాకిస్తాన్‌లో ఉన్నానా ఏంటి కలవలేకపోవడానికి? మహా అయితే ఓ అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతేగా! మనం కలవాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా కలుస్తాం," అన్నాడు.
"ఇలాంటి కబుర్లు బానే చెప్తావు… ఆ రోజు కనుక రాకపోతే, అప్పుడు చెప్తా నీ పని," అని వార్నింగ్ ఇచ్చింది జయ.
అప్పుడు నాని, "సరే, నీకోసం ఏం తేవమంటావ్?" అని అడిగాడు.
"ఏమైనా మంచి బొమ్మలు గీసి తీసుకురా. కృష్ణుడివి లాంటివి. లేదా నీ ఇష్టం ఏదైనా ట్రై చెయ్," అంది జయ.
నాని "సరే" అన్నాడు.
"మరి నీకోసం ఏం తీసుకురామంటావు? నీకు ఇష్టమైన వస్తువు ఏంటి నానీ?" అని అడిగింది జయ.
నానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన జీవితంలో ప్రత్యేకంగా ఇష్టమైనవి అంటూ ఏమీ లేవని అతనికి ఆ క్షణమే అర్థమైంది.
వెంటనే కంగారుగా వాళ్ల అమ్మమ్మ ఫోన్ తీసుకుని, తేజకి కాల్ చేశాడు. "రేయ్ లైన్‌లో ఉండు. తను హోల్డ్‌లో ఉంది, త్వరగా నాకు ఇష్టమైన వస్తువు ఏంటో చెప్పురా," అని అడిగాడు.
దానికి తేజ వెటకారంగా, "అఘోరాలా బతుకుతావు… నీకు అలాంటివి కూడా ఏమైనా ఉంటాయారా! మహా అయితే నీ కెమెరా," అన్నాడు.
"ఛీ, పెట్టెయ్ రా!" అని విసుక్కుని కాల్ కట్ చేశాడు నాని.
ఇంతలో "హలో? నానీ? ఉన్నావా?" అని అడిగింది జయ.
"జయా… నాకంటూ ప్రత్యేకంగా ఇష్టమైనవేమీ లేవు. నువ్వు జస్ట్ నాతో కాస్త సమయం గడుపు, నాకు అది చాలు," అన్నాడు నాని మనస్ఫూర్తిగా.
"అయ్యో పిచ్చి నానీ! నేను ఎలాగూ వస్తాను కదా! పోనీ, నీకోసం ఏదైనా వండి తీసుకురానా?" అని అడిగింది.
"నీ చేతులతో ప్రేమగా వండి పెడితే నేను వద్దంటానా!" అన్నాడు నాని.
"సరే, తాటి గారెలు చేసి తీసుకువస్తా," అంది జయ ఉత్సాహంగా.
"సరే ప్రిన్సెస్ గారూ, మీ ఇష్టమే నా ఇష్టం," అన్నాడు నాని.
అలా నాని మేడ మీద ఆకాశంలో నక్షత్రాలను, చందమామను చూస్తూ, రాత్రంతా జయతో ఫోన్లో మాట్లాడుతూనే గడిపేశాడు…
వాళ్లకి అసలు సమయమే తెలియడం లేదు. జయ అయితే నాని దగ్గర ఒక చిన్న పిల్లలాగా మారిపోయి ఎన్నెన్నో కబుర్లు చెప్తోంది. ఎందుకంటే, మనకు బాగా ఇష్టమైన వాళ్ల దగ్గరే కదా మనం చిన్నపిల్లలమైపోయేది!