ప్రజ్ఞ సుశాంత్‌తో మాట్లాడుదామని రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సుశాంత్, రామ్‌తో కలిసి డాబా మీద ఉంటాడు. సుశాంత్‌కి తగిలిన దెబ్బలు చూసి రామ్ వాళ్ళ నాన్న, "ఏమయింది రా? ఎప్పుడూ ఏదో ఒక గొడవ అవసరమా నీకు?" అని మందలింపుగా అడుగుతాడు.
దానికి రామ్, "అలా కాదు డాడీ, వాడి పరిస్థితి బాలేదు, చాలా బాధలో ఉన్నాడు," అని సర్దిచెబుతాడు.
"సరే, మేడ మీదే ఉండండి. దిండు, దుప్పటి తీసుకొస్తా ఇద్దరికీ," అని రామ్ వాళ్ళ నాన్న అనగా, "వద్దులే డాడీ, నేనే తెచ్చుకుంటా," అని చెప్పి ఆయనను కిందకు పంపించేస్తాడు రామ్. ఆయన వెనుక రామ్ కూడా కిందకు వెళ్తాడు.
ఈలోగా బయట ఉన్న ప్రజ్ఞ సుశాంత్‌ను చూసి, "సుశాంత్..." అని పిలుస్తుంది. ఆమెను చూసిన సుశాంత్ కిందకు వస్తాడు.
సుశాంత్‌ను అలా చూసిన ప్రజ్ఞ ఏడుస్తూ, "అయామ్ సో సారీ రా... ఇలా అవుతుందని నాకు తెలీదు," అంటుంది.
"తెలిస్తే ఏం చేసేదానివి? మహా అయితే ఫస్ట్ ఎయిడ్ చేసేదానివి, అంతేగా," వెటకారం కలిపిన బాధతో అంటాడు సుశాంత్. ఇది ఇంట్లోనుంచి గమనిస్తున్న రామ్, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్‌గా ఉండిపోతాడు.
ప్రజ్ఞ సుశాంత్ చేతులు పట్టుకుని, అతని కళ్లలోకి చూస్తూ, "నీ కోసం వచ్చేసా... ఇంకా నీతోనే ఉండిపోతా," అంటుంది.
కానీ సుశాంత్ తన చేతుల్ని విడిపించుకుని, "నా దగ్గర ఏముందని వచ్చేస్తావు? ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, రామ్ గాడు పెడితే గానీ తినడానికి తిండికి దిక్కులేదు... అయినా, నేను చూడడానికి కూడా ఏం అంత బాగోను. నీకు హస్బెండ్ అయ్యే అర్హత నాకు లేదు ప్రజ్ఞ," అని తల దించుకుని అంటాడు.
"నువ్వు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నానే తప్ప, ఇలా చేస్తావని కాదు," అంటుంది ప్రజ్ఞ.
సుశాంత్ గట్టిగా నిట్టూర్చి, "నిన్ను మీ పేరెంట్స్ మహారాణిలా చూసుకుని ఉంటారు... నాతో ఉంటే నీకు ఆ ఆనందం ఉండదు ప్రజ్ఞ. వెళ్లిపో," అని ఆమె వంక చూడకుండానే కఠినంగా చెప్పేస్తాడు.
అదే సమయానికి ప్రజ్ఞ వాళ్ళ నాన్న, అన్నయ్య అక్కడికి వస్తారు. అన్నయ్య సుశాంత్‌ను పక్కకు తోసేయగా, ఆమె నాన్న ప్రజ్ఞ చెయ్యి పట్టుకుని లాక్కుపోతూ, "నా పరువు మొత్తం బజారుపాలు చేశావే... నిన్ను గారాబంగా పెంచడం నా తప్పు," అని అరుస్తాడు.
ఇది చూసి, కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చిన రామ్, ప్రజ్ఞ వాళ్ళ అన్నయ్య శ్రీధర్‌ని చితకబాదుతాడు. దెబ్బలకు శ్రీధర్ తల నుంచి రక్తం కారడం మొదలవుతుంది. అప్పుడు కింద పడి ఉన్న సుశాంత్ లేచి రామ్‌ని ఆపుతాడు.
"చూడండి, నిన్ను కొట్టలేక కాదు... మీ అమ్మాయిని మీరే తీసుకెళ్లిపొండి... నాకేం అక్కర్లేదు. కానీ... నా స్నేహితుడ్ని ఒక్క మాటన్నా, ఇంకేమైనా చేసినా ఖబడ్దార్," అని హెచ్చరిస్తాడు.
ఆ మాటలకు ప్రజ్ఞ షాక్‌లో ఉండిపోతుంది. తనకు ఇక సుశాంత్ అక్కర్లేదని అర్థమవడంతో మాటలు రాక అలా చూస్తూ ఉండిపోతుంది.
ఇంకా ఆవేశంతో రగిలిపోతున్న రామ్, "నన్ను నువ్వు ఆపకపోయి ఉంటే, వాడు నా చేతిలో చచ్చేవాడు రా," అంటాడు. సుశాంత్ అతన్ని సముదాయిస్తూ ఇంట్లోకి తీసుకువెళ్తాడు.
తన నాన్న లాక్కువెళ్తున్నా సరే, ప్రజ్ఞ మాత్రం వెనక్కి తిరిగి సుశాంత్ తన వంక చూస్తాడేమోనని ఆశగా చూస్తుంది. కానీ సుశాంత్ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడడు.
తన సర్వస్వాన్నీ కోల్పోయిన పరిస్థితిలో కూడా సుశాంత్‌తోనే ఉండాలని వచ్చిన ప్రజ్ఞకు, విధి ఇంకేదో ప్లాన్ రాసిపెట్టిందేమో...