గుడి లోపలికి అడుగుపెట్టగానే వాళ్లకు అసలైన సవాలు ఎదురైంది. అక్కడ దర్శనం లైన్‌లో కలవడం చాలా కష్టం. చుట్టూ జనం అంతా “హరే కృష్ణ, హరే కృష్ణ” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. వాళ్ల ముందే ఇస్కాన్ టెంపుల్ హాల్‌లో ఒక పెద్ద హోమం జరుగుతోంది.
సరిగ్గా అప్పుడే ఆ దారి మధ్యలోంచి ఒక వ్యక్తి పూల బుట్ట తీసుకుని వెళ్తుండగా, గుడి సిబ్బంది అతన్ని గట్టిగా కేకలు వేశారు.
అది చూసిన తేజ భయపడుతూ, “రేయ్… వాడు గుడికి సంబంధించిన వాడే, వాడినే అంత దారుణంగా తిట్టారు. ఇక మనం ఆ లైన్‌లోకి వెళ్లడం అసాధ్యం రా,” అన్నాడు.
కానీ జనార్దన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
“పదండి...” అంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు.
అంత మంది జనం, పెద్ద పెద్ద వీఐపీలు, సెక్యూరిటీ ఉన్నా… విచిత్రంగా జనార్దన్‌ని ఎవ్వరూ ఆపలేదు. అతనితో పాటు అనూష, వాళ్ల ఫ్రెండ్స్ కూడా సులువుగా ముందుకు వెళ్లిపోయారు.
ఏదోలా వాళ్లు ఆ జనాన్ని దాటేశారు కానీ, అసలు లైన్‌లోకి వెళ్లడం మాత్రం కష్టంగా మారింది. అక్కడ కాలేజీ స్టూడెంట్స్‌ను వాలంటీర్లుగా/సెక్యూరిటీగా పెట్టారు.
నాని నేరుగా వాళ్ల దగ్గరికి వెళ్లి, అనూష వాళ్లను చూపిస్తూ...
“బ్రదర్… వీళ్లు అమ్మాయిలు. ఇక్కడి దాకా ఏదో లక్‌తో వచ్చేశాం. ఇప్పుడు నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే వీళ్లకు దర్శనం అయిపోతుంది భయ్యా…” అని బ్రతిమిలాడాడు.
అతను ఒకసారి వాళ్లందరినీ చూసి, “సరే బ్రదర్… వెళ్ళండి,” అని దారి ఇచ్చాడు.
అంతే… ఎవరికీ తెలియకుండా ఆ కుర్రాడు వాళ్లని లోపలికి పంపించడంతో అనూష, వాళ్ల ఫ్రెండ్స్ చాలా ఆనందపడ్డారు.
కానీ తేజ మాత్రం ఆ హడావిడిని, పెద్ద సెక్యూరిటీని చూసి భయపడి, హోమం జరిగే చోటే ఆగిపోయాడు. జనార్దన్ వెనక్కి తిరిగి చూసేసరికి తేజ కనిపించలేదు. వెంటనే వెనక్కి వెళ్లి వాడిని తీసుకొచ్చేసరికి వాళ్లు లైన్‌లో కాస్త వెనుకబడ్డారు.
అప్పటికే అనూష వాళ్లు దర్శనానికి ముందుకు వెళ్లిపోయారు. కానీ అనూష కళ్లు మాత్రం వెనక్కి తిరిగి జనార్దన్ కోసమే వెతుకుతున్నాయి. సరిగ్గా జనార్దన్ దగ్గరే లైన్ ఆపేశారు!
నాని అక్కడ ఉన్న లేడీ సెక్యూరిటీని అడిగాడు,
“అక్కా… మా ఫ్రెండ్స్ ముందున్నారు. కొంచెం నన్ను వెళ్లనివ్వండి…” అని. కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు.
అనూష ముందుకు వెళ్లిపోయి కూడా, జనార్దన్ కోసం వెనక్కి చూస్తూ ఆగిపోయింది.
అప్పుడే అక్కడున్న పూజారి, “అమ్మా… మీరు కదలాలి. మీవల్ల లైన్ ఆగిపోతోంది,” అని తొందరపెట్టాడు.
అనూషకి చాలా బాధగా అనిపించింది. జనార్దన్ వైపు చూస్తూ ముఖం చిన్నబుచ్చుకుని, “రావచ్చు కదా...” అని సైగ చేసింది.
జనార్దన్ మాత్రం తన లోపలి బాధను దాచుకుంటూ, ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుని “నువ్వు దణ్ణం పెట్టుకో… మనం మళ్లీ ఎప్పుడైనా కలిసి వద్దాంలే,” అని సైగ చేశాడు.
నిజానికి అతనికి కూడా అనూషతో కలిసి రాధాకృష్ణులను దర్శించుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ తన భావాలను బయటపెట్టడం అతనికి రాదు. లోపల ఎంత బాధ ఉన్నా, బయట మాత్రం ఎవరూ చూడలేనంత ప్రశాంతంగా నిలబడిపోయాడు.
ఆ క్షణంలో ఇద్దరి ముఖాల్లోనూ ఒకటే భావన — “కలిసి ఉండాలనుకున్న చోట… ఇలా విడిపోయామేంటి!” అనే చిన్న వెలితి.
అనూష కళ్లు మూసుకుని రాధా-కృష్ణులకు నమస్కారం చేసుకుంటోంది, జనార్దన్ మాత్రం ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు.
ఇదంతా గమనిస్తున్న తేజ, వెనకనుంచి నానిని బలంగా ఒక్క తోపు తోశాడు!
అంతే… జనార్దన్ అమాంతం ముందుకు వెళ్లి, సరిగ్గా అనూష పక్కనే చేరిపోయాడు.
తేజ సైలెంట్‌గా కన్నుగీటి “ఎంజాయ్” అని సైగ చేశాడు.
అలా… ఇద్దరూ పక్కపక్కనే నిలబడి రాధా-కృష్ణులను దర్శించుకున్నారు.
ఆ క్షణం జనార్దన్ మనసులో ఒకే కోరిక — “అనూష ఎప్పుడూ ఇలా నవ్వుతూ, సంతోషంగా ఉండాలి…”
అనూష చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటుంటే, జనార్దన్ మాత్రం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణం అతనికి దేవుడి కంటే… ఆమెనే ముఖ్యమైపోయింది.
అనూష కళ్లు తెరిచి, “వెళ్దామా?” అని అడిగింది.
జనార్దన్ ఇంకా ఆ మధురమైన భావనలోనే ఉండిపోయి, నెమ్మదిగా తల ఊపాడు.
చుట్టూ గుడి ఎంతో అందంగా అలంకరించబడింది. రాధా-కృష్ణులు ప్రేమకు ప్రతీక. సరిగ్గా అలాంటి చోట… వాళ్లిద్దరి కలయిక జరగడం, వాళ్ల జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన క్షణంగా మిగిలిపోయింది.
“జనార్దన్…” అని అనూష పిలిచిన ఆ స్వరం, అతని గుండెల్లో అలా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
దర్శనం చేసుకుని గుడి బయటికి వస్తుండగా, స్పీకర్‌లో “జయ జనార్ధన... కృష్ణ మురారి...” అనే పాట వినసొంపుగా వినిపిస్తోంది. (ఆమె పేరు జయ, ఇతని పేరు జనార్దన్!)
ఆ పాట మధ్యలో… జనార్దన్ అనూష వైపు చూస్తూ నడుస్తున్నాడు.
ఆ క్షణం — ఆ పాట, ఆ దేవుడు, ఆ ప్రదేశం, ఆమె… అన్నీ ఒకటిగా కలిసిపోయినట్టు అనిపించింది అతనికి.
“సరే… బయట కాస్త తిరుగుదాం,” అంది అనూష.
అందరూ గుడి ప్రాంగణం బయటికి వచ్చారు.
జనార్దన్ ముందుకు నడుస్తున్నాడు… అనూష అతని వెనుక నడుస్తోంది.
ఒక్కసారిగా జనార్దన్ వెనక్కి తిరిగి ఆమెను చూసి నవ్వాడు.
ఆ నవ్వులో — చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞత, ప్రేమ… అన్నీ కలగలిసి ఉన్నాయి.
ఎందుకంటే… జనార్దన్ జీవితంలో ఎప్పుడూ, ఎవ్వరూ అతనికి అంత ప్రాముఖ్యత, అంత ప్రేమ ఇవ్వలేదు. తాను ఇన్నాళ్లూ కోల్పోయిన ఆత్మీయత అంతా… అనూష రూపంలో తిరిగి దొరికినట్టుగా అనిపించింది. ఆమెను దేవుడు తన జీవితంలోకి పంపిన ఒక అద్భుతమైన వరం లాగా భావించాడు. అందుకే ఆ నవ్వు… అంత నిజమైనది, స్వచ్ఛమైనది.
వాళ్లిద్దరి ఆనందాన్ని వ్యక్తపరచడానికి అక్కడ మాటలు సరిపోలేదు. వాళ్ల మధ్య ఒక మధురమైన నిశ్శబ్దం మాత్రమే రాజ్యమేలుతోంది.
అలా… అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గోదావరి తీరం వైపు నడిచారు…