ఆ గోదావరి ఒడ్డున వాళ్లిద్దరూ అలా ప్రశాంతంగా కూర్చున్నారు. వాళ్ల స్నేహితులంతా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో ఫోటోలు దిగుతూ సందడిగా ఉన్నారు. వీళ్లిద్దరూ మాత్రం ఏమీ మాట్లాడుకోకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. జనార్దన్ ఏమైనా మాట్లాడతాడేమోనని అనూష, అనూష ముందు మాట్లాడుతుందేమోనని జనార్దన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎదురుచూస్తున్నారు.
జనార్దన్ మౌనం వీడేలా లేడని గ్రహించిన అనూష, ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ... "నీకో విషయం చెప్పాలి! అది విన్నాక నేను ఏం చేయాలో నువ్వే సలహా ఇవ్వాలి," అని అడిగింది.
"సరే, చెప్పు," అన్నాడు జనార్దన్.
"జనార్దన్! మా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉండేది. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోయారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు కానీ, తను మాత్రం ఆ అబ్బాయి తనకోసం ఖర్చుపెట్టిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటోంది," అని తన స్నేహితురాలి పరిస్థితి గురించి చెప్పింది.
అది విన్న జనార్దన్ తేలిగ్గా తీసుకుంటూ... "వాళ్లు మళ్ళీ కలిసిపోతారులే! నువ్వు మధ్యలోకెళ్తే నిన్నే తింగరిపిల్లని చేసి ఆడుకుంటారు. ప్రేమలో గొడవలవ్వడం, మళ్ళీ కలిసిపోవడం కామనే కదా. నువ్వు అనవసరంగా వాళ్ల మధ్యలోకి వెళ్ళకు," అని సలహా ఇచ్చాడు.
"అలా కాదు, సమస్య ఏంటంటే... ఆ డబ్బులు నా అకౌంట్‌కి పంపుతానంటోంది. నేను ఆ మనీని ఆ అబ్బాయికి పంపాలట!" అంది అనూష కంగారుగా.
జనార్దన్ నవ్వి, "సరిపోయింది! అయినా వాళ్లు లవ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఇష్టంతో ఖర్చుపెట్టుకున్న డబ్బులు, విడిపోయాక మళ్ళీ వెనక్కి ఇవ్వడం ఎందుకు? ఖర్చుపెట్టించుకున్నప్పుడు లేని ప్రాబ్లమ్ ఇప్పుడు ఏంటి? అయినా పాపం ఆ అబ్బాయి అడగలేదు కదా! నువ్వు అస్సలు వాళ్ల వ్యవహారంలో ఇన్‌వాల్వ్ అవ్వకు! వాళ్లు కచ్చితంగా మళ్ళీ కలిసిపోతారు చూడు," అని కరాఖండిగా చెప్పాడు.
అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదన్న అతని మెచ్యూరిటీ చూసి, అనూష జనార్దన్ వైపు అలా ప్రేమగా చూస్తూ... "అవును, నీలో బ్యాడ్ క్వాలిటీస్ (Bad qualities) ఏమీ లేవా ఏంటి! అసలు నువ్వు మాట్లాడే విధానం, నీ ఆలోచన, నీ మైండ్‌సెట్...." అని మెచ్చుకుంటూ ఆగిపోయింది.
"మనసు..?" అన్నాడు జనార్దన్ చిన్నగా నవ్వుతూ.
"అవును! నీ మైండ్, నీ మనసు వెన్న లాంటివి. ఈరోజు ఎందుకో నాకు చాలా హ్యాపీగా ఉంది కదా!" అంది అనూష.
"అవును, నా లైఫ్‌లో ఇంత హ్యాపీగా నేను ఎప్పుడూ లేను. ఎందుకంటే, చిన్న వయసులోనే పేరెంట్స్‌కి దూరంగా పెరిగాను. హాస్టల్ లైఫ్, ఫ్రెండ్స్... అంతే నా ప్రపంచం. కానీ ఇప్పుడు నువ్వు పరిచయమయ్యాక నా రొటీన్ లైఫ్‌కి ఒక అందమైన కలరింగ్ వచ్చింది. యు ఆర్ సచ్ ఏ పాజిటివ్ వైబ్ (You are such a positive vibe)!" అని తన మనసులోని మాటను బయటపెట్టాడు జనార్దన్.
"అవును, మనం ఇన్ని సార్లు కలవడానికి ప్రయత్నించాం కదా! కానీ ఈరోజే కుదిరింది, ఎలా అంటావ్?" అని అడిగింది అనూష.
"ఇప్పుడు కలవాలని రాసిపెట్టి ఉంది, కలిశాం. అయినా ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా!" అన్నాడు జనార్దన్.
అనూష కొంచెం జనార్దన్ దగ్గరికి జరిగి... "కాదు, మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. ఎలాగంటే... దేవుడి మీద నమ్మకం లేదన్నావు, కానీ గుడికి వచ్చావు! అంటే ముందుగా రావాలని డిసైడ్ అవ్వకుండానే ఈరోజు ఇక్కడున్నావు కదా!" అని లాజిక్ లాగింది.
జనార్దన్ నవ్వుతూ, "అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్. నేను వచ్చింది నీ కోసం, ఆ దేవుడి కోసం కాదు," అని సూటిగా చెప్పాడు.
అనూష సిగ్గుపడుతూనే టాపిక్ మార్చి, "సరే సరే, ఇంతకీ ఎవరో మీ ఫ్రెండ్ వస్తారన్నావు కదా, ఎవరతను?" అని అడిగింది.
"వెంకట్ అని నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. మేమిద్దరం సేమ్ స్కూల్, నెయిబర్స్ కూడా. చిన్నప్పుడు నేను ఇక్కడే పెరిగాను కదా," అన్నాడు.
'వెంకట్' అనే పేరు వినగానే అనూష ముఖంలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. "పేరు ఏమన్నావ్!" అని కంగారుగా అడిగింది.
"వెంకట్! బహుశా మీ కాలేజీలోనే చదువుతున్నాడనుకుంటా," అన్నాడు జనార్దన్ క్యాజువల్‌గా.
"అవును, నాకు బాగా తెలుసు. ఒకవేళ వాడు నిన్నిక్కడ చూసి, 'నువ్వేంటి ఇక్కడ?' అని అడిగితే! 'మీ ఇద్దరికీ పరిచయం ఉందా? డైలీ మాట్లాడుకుంటున్నారా?' అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే ఎలా?" అని గాబరా పడిపోయింది.
జనార్దన్ ఆమెను కూల్ చేస్తూ, "అంత సీన్ లేదులే, వాడేమంటాడు? అయినా వాడు రావట్లేదని మెసేజ్ పెట్టాడు. ఇంతకీ నీకెందుకంత భయం?" అని అడిగాడు.
"అలా ఏం లేదు... ఎవరైనా నాలాంటి ఒక అమ్మాయిని నీతో చూస్తే ఏమనుకుంటారు!" అని కవర్ చేసుకుంది.
దానికి జనార్దన్ ఆమెను చూసి చిరునవ్వుతో, "ఏమనుకుంటారు... గుడికి వచ్చింది కదా, ఎంత పద్ధతి గల అమ్మాయో అని అనుకుంటారు," అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
సరిగ్గా అప్పుడే అనూష వాళ్ల స్నేహితులు అక్కడికి వచ్చి, "అనూషా, ఏంటి విషయం?" అని కొంటెగా అడిగారు.
అనూష సిగ్గుపడుతూ, "మీరు అనుకునేదే," అని చిన్నగా చెప్పింది.
వాళ్ల స్నేహితులు నవ్వుకుంటూ, "సరే, ఒకసారి ఇలా రా! అలా వెళ్లి వద్దాం," అని అనూషని పక్కకు తీసుకెళ్లారు.
వెళ్తూ వెళ్తూ అనూష వెనక్కి తిరిగి జనార్దన్ వైపు చూసి, 'ఇప్పుడే వస్తా ఆగు' అని సైగ చేసింది.