SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 3

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

Active
03

EPISODE 3

File // 02

EPISODE 2

ఉదయం కిరణాలు ఇంకా గదిలోకి తొంగిచూడకముందే, చేతిలో వేడివేడి కాఫీ కప్పుతో పడకగదిలోకి అడుగుపెట్టింది రుక్మిణి. కళ్యాణ్ ఇంకా గాఢనిద్రలోనే ఉన్నాడు. టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టి అతన్ని తట్టి లేపడానికి ప్రయత్నించింది. ఆమె ఎంత లేపినా, బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ, "ఇంకో ఐదు నిమిషాలు ఆగు రుక్కూ..." అంటూ ముఖం మీదకు దుప్పటి లాక్కున్నాడు.

ఆ గది గోడల వైపు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది అతని నేపథ్యం. అక్కడ పదిలంగా అలంకరించి ఉన్న ఎన్నో మెడల్స్, బ్యాడ్జీలు అతనొక స్పెషల్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని ఘనంగా చాటుతున్నాయి. ఆ పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద అతని సర్వీస్ రివాల్వర్, మొబైల్ ఫోన్ విశ్రమిస్తున్నాయి.

సరిగ్గా అప్పుడే టేబుల్ మీదున్న ఫోన్ వైబ్రేట్ అవ్వసాగింది. స్క్రీన్ వైపు చూసిన రుక్మిణి, "ఏవండీ, అర్జున్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు," అంది.

'అర్జున్' అనే పేరు వినగానే కళ్యాణ్ నిద్ర మత్తు ఎటో ఎగిరిపోయింది. కాఫీ కోసం లేవని మనిషి, ఫోన్ అనగానే స్ప్రింగ్ లా లేచాడే అని రుక్మిణి కోపంగా చూస్తుండగానే... వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు అర్జున్ చెబుతున్న విషయం వింటున్న కొద్దీ కళ్యాణ్ ముఖంలో తీవ్రత పెరిగింది. ఏదో ఊహించని పెద్ద విషయం జరిగిందని అతనికి అర్థమైంది. వెంటనే కాల్ కట్ చేశాడు.

"రుక్కు, నా షర్ట్ ఇలా ఇవ్వు," అంటూనే టేబుల్ మీదున్న కాఫీని అమాంతం గొంతులో పోసుకున్నాడు. గబగబా రెడీ అయి, రుక్మిణి తెచ్చిన షర్ట్ వేసుకున్నాడు.

"కనీసం బ్రేక్ ఫాస్ట్ అయినా..." అని రుక్మిణి ఆపే ప్రయత్నం చేసినా, "చాలా ఇంపార్టెంట్ పని రుక్కూ," అంటూ కారు తాళాలు తీసుకుని ఆదరాబాదరాగా బయటకు వెళ్లిపోయాడు కళ్యాణ్.

అతను వెళ్తుంటే ఎదురువచ్చి, దేవుడికి దండం పెట్టుకుంది రుక్మిణి. "అనవసరంగా నిద్రలేపానేమో... వేడి వేడి ఉప్మా తినకుండానే వెళ్ళిపోయాడు చ! అయినా, నా చేతి ఉప్మా తినే అదృష్టం ఆయనికి లేదులే," అని తనలో తాను గునుక్కుంటూ నిట్టూర్చింది.

సరిగ్గా అరగంట తర్వాత...

క్రైమ్ జరిగిన స్పాట్ కి చేరుకున్నాడు కళ్యాణ్. అప్పటికే ఆ ఇల్లు, పరిసరాలు పోలీసుల ఆధీనంలోకి వచ్చాయి. లోకల్ పోలీస్, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రాఫర్లు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. బయట కాలిపోయిన ఓ చెట్టు పరిసరాల్లో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్స్ ఫుట్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. ఇంకొంతమంది నేల మీద పడి ఉన్న వెంట్రుకలు, రక్తపు మరకలను జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు.

కళ్యాణ్ రాకను గమనించిన ఫోరెన్సిక్ డాక్టర్ అతన్ని సమీపించాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది.

"కళ్యాణ్! మృతదేహాల ఛాతీ మీద చర్మం వలిచేసి ఉంది. ఇది ఏదో కొత్త ప్యాట్రన్ లో జరిగిన మర్డర్స్ లా అనిపిస్తున్నాయి. నా కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి క్రూరత్వం చూడలేదు," అన్నాడు ఆ డాక్టర్ గంభీరంగా.
Prev Next

Ready to play...