ఆద్య వాళ్ళ నాన్న సత్యమూర్తి గారు కొత్తగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకోవడానికి, వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఉండటానికి ఆ ఊళ్ళో ఓ కొత్త ఇల్లు కావాలి. అలాగే ఆద్య చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే... ఆమె పాత కాలేజీకి సంబంధించిన బ్రాంచ్ ఆ ఊళ్ళో ఉంటే సరిపోతుంది. ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్న కాలేజీ కాబట్టి ట్రాన్స్ఫర్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా సత్యమూర్తి గారికి ఉన్న పరిచయాల ముందు ఆద్యకు అదొక చిన్న విషయం.
విశాలమైన ఆ ఇంటి హాల్లో కుటుంబమంతా కూర్చుని ఉన్నారు.
"ఏంటి డాడీ... నువ్వేదో బిజినెస్ స్టార్ట్ చేస్తే, దానికి మేమంతా అక్కడికి ఎందుకు రావాలి?" అని అడిగింది ఆద్య కాస్త అసంతృప్తిగా.
"మనం ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నామంటే... దానికి కారణం నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మానాన్నలే ఆద్యా. వాళ్ళు ఇప్పుడు నాతో లేరు, కానీ వాళ్ళు ఆఖరి శ్వాస విడిచిన మా ఊరు ఉంది. ఆ ఊరు నాకు కన్నతల్లితో సమానం..." అన్నాడు సత్యమూర్తి గారు ఎంతో ఉద్వేగంగా.
"కానీ... నేను నా ఫ్రెండ్స్ ని మిస్ అవుతాను కదా!" అంది ఆద్య ముఖం ముడుచుకుని.
"అయినా నువ్వేదో మొక్కుబడిగా చదువుతున్నానన్నావు కదే? ఏవో సర్టిఫికెట్ల కోసమే కదా! మీ నాన్న ఎలాగూ కొనేస్తాడులే, అదో పెద్ద విషయమా?" అంది తల్లి శారదాదేవి నవ్వుతూ.
ఆ మాట వినగానే ఆద్యకు చిర్రెత్తుకొచ్చింది.
"చూడమ్మా! నేను సర్టిఫికెట్ల కోసమే చదువుతుండొచ్చు. కానీ... రేపు నాన్న బిజినెస్ ని టేకోవర్ చేయాల్సింది నేనే కదా! రేపు మన కంపెనీలో ఎం.డి.గా నా కింద పనిచేసే ఎంప్లాయీస్... 'మా ఎండీకి కనీసం ఒక డిగ్రీ కూడా లేదు, నాన్నగారి కోటాలో వచ్చేసింది' అని నన్ను తక్కువ చేసి చూడకూడదు. అవునా కాదా డాడీ?" అంది ఆద్య దీమాగా.
"చూశావా నా కూతురి తెలివితేటలు! నువ్వున్నావు ఎందుకూ..." అంటూ భార్యను ఆటపట్టించాడు సత్యమూర్తి.
ఆద్య వెంటనే వెళ్లి నాన్నను హత్తుకుని, "యూ ఆర్ ది బెస్ట్ డాడీ!" అంది మురిపెంగా.
ఇదంతా ఇలా ఉన్నా, ఆద్య మనసులో మాత్రం కొత్త కాలేజీ గురించి ఎక్కడో చిన్న బెంగ మొదలైంది. తన గదిలోకి వెళ్లి డైరీ తీసింది.
"బాబోయ్... కొత్త ఫ్రెండ్స్ తో ఎలా పరిచయం పెంచుకోవాలో ఏంటో! అందులోనూ డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ లోకి వెళ్తున్నాను. అక్కడ వాళ్ళతో నేను ఫ్రీగా ఉండలేను. ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే... మానేస్తా అంతే!" అని తన డైరీలో రాసుకుంటోంది.
సరిగ్గా అప్పుడే వెనక నుంచి వచ్చిన తమ్ముడు ధనుష్... "ఏంటక్కా! కాలేజ్ కి వెళ్లకుండా ఎగ్గొట్టడానికి ప్లాన్స్ వేస్తున్నావా ఏంటి?" అన్నాడు కవ్విస్తూ.
"పోరా! వెళ్లి నీ లగేజ్ ప్యాక్ చేసుకో," అని విసుక్కుంది ఆద్య.
కొన్ని రోజుల తర్వాత...
ఆద్య వాళ్ళ కుటుంబం కారులో ఆ కొత్త ఊరికి ప్రయాణిస్తోంది. సత్యమూర్తి గారు డ్రైవ్ చేస్తుంటే, పక్కనే కూర్చున్న ధనుష్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ నాన్నకు దారి చెప్తున్నాడు.
"నాన్నా... రైట్, రైట్ తీసుకో," అన్నాడు ధనుష్ ఫోన్లోంచి తల తిప్పకుండా.
కారును ఆ మలుపు దగ్గరే సడెన్ బ్రేక్ వేసి ఆపేశాడు సత్యమూర్తి.
"ఏముందిరా అక్కడ రైట్ తీసుకోవడానికి? అక్కడ ఏముందో కళ్ళు తెరిచి చూడు ఒకసారి," అన్నాడు విసుగ్గా.
ఫోన్ లోంచి తల పైకెత్తి చూసిన ధనుష్ కి మతిపోయింది. ముందు అసలు రోడ్డే లేదు, అదొక డెడ్ ఎండ్! పైగా అక్కడ ఓ బురద గుంటలో కొన్ని పందులు దొర్లుతూ హాయిగా నిద్రపోతున్నాయి.