రుక్మిణి గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మన కథానాయకుడు అయిన శ్యామ్ సుందర్ గురించి తెలుసుకుందాం. శ్యామ్ సుందర్ ఒక రచయిత. అనగా, అతను ఒక రైటర్ అన్నమాట. కానీ శ్యామ్ కి ఎవరు లేరు. అతను ఒక అనాథ. ఎప్పుడూ ఒక్కడే తన గదిలో ఉంటూ ఒక గొప్ప ప్రేమకథ రాయాలి అని ఊహల్లో బ్రతికేవాడు. అయితే శ్యామ్ కి ఒకే ఒక్క నమ్మకమైన స్నేహితుడు “ప్రేమానంద్”.
శ్యామ్ తన గది నిండుగా Srirangam Srinivasa Rao, Yaddanapudi Sulochana Rani, అలాగే Rabindranath Tagore చిత్రపటాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పడితే అక్కడ ఫౌంటెన్ పెన్లు 🖋️ ఉన్నాయి. అతను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అతని రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పక్కనే ఉన్న కిటికీలోంచి చూస్తే వర్షం పడటం మొదలైంది. ఆ వాతావరణం చూసిన శ్యామ్ కి నిద్ర వచ్చి ఆ టేబుల్ మీద తల పెట్టి నిద్రపోయాడు.
నిజానికి శ్యామ్ కి తన జీవితంలో ఏం చేయాలో పెద్దగా క్లారిటీ లేదు. పైగా ఎందుకు రాస్తున్నాడో, ఏం రాస్తున్నాడో కూడా పూర్తి అవగాహన లేదు. మొదలుపెట్టిన పనిని ముగించడం అసలే రాదు... ఇది అండి మన శ్యామ్ పరిస్థితి.
ఇంకా అతని రూమ్ చూస్తే మొత్తం చింపి పారేసిన పేపర్లు, నేలమీద పడి ఉన్న ఇంక్ బాటిల్స్, అలాగే చిందరవందరగా ఉన్న అతని చాప, దిండు, దుప్పటి, కనీసం విప్పిన దుస్తులు కూడా సరిగా పెట్టలేదు. అయినా సరే ఏదో బ్రతుకుతున్నాననే భావనలో జీవిస్తున్నాడు...
ఒక వారం తర్వాత...
శ్యామ్ స్నేహితుడు ప్రేమ్ వచ్చి శ్యామ్ ని నిద్ర లేపాడు.
“రే, నీ బుక్ కంప్లీట్ చేశావా లేదా? మీ మామగారు ఈ రోజు రమ్మన్నారు కదా, మర్చిపోయావా?” అని అంటాడు ప్రేమ్.
అలా అంటూనే అక్కడ ఉన్న బుక్ ని ఓపెన్ చేసి చూసాడు.
“పర్లేదు, ఈసారి బానే రాశావ్. ఈసారి అన్నా మీ మామ ఈ బుక్ ని పబ్లిష్ చేస్తే బాగుంటుంది. లేకపోతే కూలీ పనికి పోవడమే ఇంక నువ్వు” అని అంటాడు ప్రేమ్.
శ్యామ్ పైకి లేచి బద్దకం విరుస్తాడు. ఏదో అసలు ఆసక్తి లేనట్టు రెడీ అయ్యి, ఇద్దరూ అలా వాళ్ళ మేనమామ ఇంటికి బయల్దేరారు.
నిజానికి శ్యామ్ అనాథ కాదు. కానీ వాళ్ళ చుట్టాలు, బంధువులు ఉన్నా కూడా శ్యామ్ ని ఎవరు పట్టించుకోలేదు. శ్యామ్ వాళ్ళ చిన్నాన్న అన్న మాట —
“వాడు మగాడే కదా, బ్రతకడం రాదా ఏంటి? ఒక రోజు కూలీకి వెళ్తే వారం రోజులు తినొచ్చు. వాడేం అన్నా ఆడపిల్లా? పెంచి పోషించి పెళ్లి చేయడానికి?” అని అన్నాడు వాళ్ళ చిన్నాన్న.
అప్పుడు శ్యామ్ వయసు ఎనిమిది ఏళ్లు. సొంత చెల్లి కొడుకు కావడంతో శ్యామ్ వాళ్ళ మేనమామ శ్యామ్ కి అప్పుడు అప్పుడు తోచినంత సాయం చేస్తాడు. కానీ శ్యామ్ ని వాళ్ళ ఇంటి గుమ్మం ఎక్కనివాడు. వాళ్ళ మేనత్త శుబ్బలక్ష్మి గారికి మాత్రం శ్యామ్ అంటే అసలు ఇష్టం లేదు. పైగా వాళ్ళ ఇంట్లో ఈడొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి అసలు శ్యామ్ అంటేనే గిట్టదు ఆవిడకి.
ప్రతి మనిషికి ఏదో ఒక కారణం ఉంటుంది వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి. అలాగే గతంలో శ్యామ్ వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు ఆస్తి విషయంలో జరిగిన తగాదాల కారణంగా, ఆ కోపం ఆవిడకి చూపించడానికి శ్యామ్ తప్ప వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికిలేరు.
అయినా సరే శ్యామ్ ఒక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ, ప్రేమ్ తో స్నేహం పెంచుకుని, అలా అలా చదువు, తెలుగు రాయడం కూడా ప్రేమ్ దగ్గర నేర్చుకున్నాడు. అలా అలవాటు అయిన జీవితం, శ్యామ్ కి ఒక పూట ఎలా సరిపెట్టుకోవాలి అనే విషయం నేర్పింది కానీ, తర్వాత ఏం చేస్తే అతని జీవితం మారుతుంది అనేది ఇంకా రుచి చూపించలేదు.
కానీ శ్యామ్ కన్నా పెద్ద రచయిత అన్నాడు కదా! ఆ దేవుడు శ్యామ్ తలరాతలో ఏం రాయబోతున్నాడో...