(గత ఎపిసోడ్ కొనసాగింపు...)
"...నా కళ్ల ముందే ప్రాణాలు వదిలాడు నాన్నా," అంటూ తండ్రిని గట్టిగా పట్టుకుని గుండెలు పగిలేలా ఏడ్చేసింది ఆద్య.
సరిగ్గా అప్పుడే పక్కనుంచి ముకుంద్ వాళ్ల నాన్న, అమ్మ, చెల్లెలు నిత్య కూడా అక్కడికి వచ్చారు. వాళ్లందరూ శోకసంద్రంలో మునిగి ఉన్నారు.
ముకుంద్ వాళ్ల నాన్న ఏడుస్తూనే ముందుకు వచ్చి... "ఏడవకమ్మా... మా అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని నువ్వే నీ గుండెల్లో దిగమింగుకున్నావు తల్లీ. నువ్విలా ఏడిస్తే నా కొడుకు ఆత్మ శాంతించదు. డాక్టరుగారు జరిగిందంతా మాకు చెప్పారు," అని కంటతడి పెట్టుకున్నాడు.
ఇంతలో అక్కడికి ఆ సభ నిర్వహిస్తున్న పెద్దమనిషి (ముకుంద్‌కు ఫోన్ చేసిన సైంటిస్ట్) వచ్చాడు.
"సారీ ఆద్యా... ఈ నిజాన్ని ఇంకెంతో కాలం దాయలేకపోయాను. మీ ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఫ్రంట్ రో (Front row)లో కూర్చోండి సార్," అని సత్యమూర్తిని కోరాడు. అందరూ వెళ్లి ముందు వరసలో కూర్చున్నారు.
సభ వేదిక మీద కార్యక్రమం మొదలైంది. ప్రణీత్ కూడా ఆ సైంటిస్ట్‌తో పాటు స్టేజ్ మీదే ఉన్నాడు. ప్రణీత్ కళ్లలోంచి నీళ్లు ఆగడం లేదు. మైక్ అందుకున్న ఆ డాక్టర్ (సైంటిస్ట్), ఆరు నెలల క్రితం ముకుంద్‌కు అసలేం జరిగిందో ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టాడు.
"నేను ముకుంద్ రిపోర్ట్స్ చూశాక, అతనికి పర్సనల్‌గా ఫోన్ చేసి... అతనికి ఉన్న సమస్య ఏంటో, దాని తీవ్రత ఏంటో వివరంగా చెప్పాను..."
(ఫ్లాష్‌బ్యాక్ - ఆరు నెలల క్రితం)
ఐసీయూలో ముకుంద్‌ను ఆ నరకయాతనలో చూడలేక ఆదికేశవ కృంగిపోయాడు. ఏం చేయాలో పాలుపోక దేవుడి వైపు దీనంగా చూశాడు.
ముకుంద్ ఎంతో నొప్పిని భరిస్తూనే... "సార్... నా ఫోన్‌లో రీసెంట్ కాల్స్‌లో ఒక అన్‌నోన్ నెంబర్ '88'తో ఎండ్ అవుతుంది... దానికి ఫోన్ చేయండి ప్లీజ్... ఒక పెద్దాయన మాట్లాడుతారు," అని ఆదికేశవను బతిమాలాడు.
వెంటనే ఆదికేశవ ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. ఆ ముసలాయన (సైంటిస్ట్) కాల్ లిఫ్ట్ చేశాడు. ముకుంద్ పరిస్థితి అర్థం చేసుకున్న ఆ పెద్దాయన... వెంటనే ముకుంద్‌ను తన ల్యాబ్‌కు తీసుకురమ్మని ఆదేశించాడు.
ఆదికేశవ, ప్రణీత్ ఇద్దరూ కలిసి ముకుంద్‌ను అక్కడినుంచి తీసుకెళ్లి ఆయన ల్యాబ్‌లో జాయిన్ చేశారు.
ల్యాబ్‌లో ఆ సైంటిస్ట్ ముకుంద్‌కు అనస్థీషియా (మత్తు మందు) ఇచ్చాడు.
"అతని నొప్పిని తట్టుకోవడం అసాధ్యం. అందుకే అన్‌అఫీషియల్‌గా మీ పర్మిషన్ లేకుండా అనస్థీషియా ఇవ్వాల్సి వచ్చింది," అని తన చైర్‌లో కూర్చుంటూ చెప్పాడు. ఆదికేశవ, ప్రణీత్‌లను కూడా కూర్చోమన్నాడు.
"సార్... వాడికి ఏమైంది అసలు? ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఇక్కడున్నాం," అని ప్రణీత్ ఆందోళనగా అడిగాడు.
అప్పుడు ఆ సైంటిస్ట్, "సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం నా మనవడు 'రాకిస్-ఫేజ్' (Rachis-Phage) అనే ఒక విచిత్రమైన, ప్రాణాంతకమైన జబ్బు బారినపడి చనిపోయాడు. దాని సింప్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. నరాల వాపు, యూరినరీ ఫంక్షనింగ్ దెబ్బతిని భరించలేని నొప్పి రావడం, గుండెను రెండు చేతులతో పట్టి పిసికినంత దారుణమైన పెయిన్ కొన్ని సెకన్ల పాటు రావడం... నెమ్మదిగా బాడీలోని ఒక్కో పార్ట్ మీద గ్రిప్ కోల్పోవడం. ముకుంద్ ప్రాబ్లమ్ కూడా అదే. నా మనవడి చావును కళ్లారా చూసినవాడిని నేను. ఇప్పుడు ముకుంద్ పరిస్థితి చూస్తుంటే..." అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ జబ్బు తీవ్రత గురించి వివరించాడు.
అది విన్న ఆదికేశవ చేతులు జోడించి, "మరి మీరేదో ఒక పరిష్కారం చూడండయ్యా... ఆ కుర్రోడి ప్రాణాలు కాపాడి, నా రుణం నేను తీర్చుకునేలా చేయండి," అని బతిమాలాడు.
ఆ సైంటిస్ట్ నిస్సహాయంగా, "నిజం చెప్పాలంటే... ముకుంద్ బతకడం చాలా కష్టం. నేను కేవలం అతనికి నొప్పి లేని చావుని మాత్రమే ఇవ్వగలను," అన్నాడు.
ఆ మాట వినగానే ఆదికేశవలో ఉన్న రౌడీ మళ్లీ బయటకొచ్చాడు. వెంటనే ఆ సైంటిస్ట్ కాలర్ పట్టుకుని, పీక మీద కత్తి పెట్టి...
"నీ యబ్బ... మా ముకుంద్ చెప్పాడని ఇక్కడికి తీసుకొస్తే, బతికే ఛాన్సే లేదని అంటావా నా కొడకా..." అని గట్టిగా అరిచాడు. ప్రణీత్ ఆదికేశవను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆదికేశవ ఆగట్లేదు.
సరిగ్గా అదే సమయానికి వాళ్ల వెనక నుంచి ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది.
వాళ్లు వెనక్కి తిరిగి చూశారు... అక్కడ ఉన్నది మరెవరో కాదు, ఆద్య!
"మీరు... మీరు ముకుంద్ గురించే కదా మాట్లాడుకుంటున్నారు? చెప్పండి... ముకుంద్‌కి ఏమీ కాదు కదా... చెప్పండి ప్లీజ్," అని గుండెలు పగిలేలా ఏడుస్తూ అడిగింది ఆద్య.
ఆ సైంటిస్ట్ ఆద్య దగ్గరకు వచ్చి, "ముకుంద్ ఎంతకాలం బతుకుతాడో తెలియదమ్మా... అదే చేదు నిజం. కానీ నీకేం చెప్పి ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. నా మనవడిలా ఇంకెవరూ చనిపోకూడదన్న కసితోనే ఈ డిసీజ్ మీద ఏడేళ్ల క్రితం రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఈ జబ్బుకు సంబంధించిన టిష్యూ సెల్స్ (Tissue cells) ద్వారా, దీనికి యాంటీబయాటిక్ కనిపెట్టే అవకాశం నాకు ఇప్పుడు దొరికింది. నా ప్రయత్నం నేను చేస్తాను. దీనికి పర్మనెంట్ క్యూర్ (Permanent cure) కనిపెట్టడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను తల్లీ," అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.