తర్వాతి రోజు ఉదయం
ఆ ఊరి జనం మన శ్యామ్‌ని ఆ ఊళ్లలో జరిగే అమ్మవారి జాతరకు ఆహ్వానించారు.
ఆ జాతి పెద్ద :-
"శ్యామ్ బాబు, 179 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ జాతర ఊరు మొత్తం కలిసి జరుపుకుంటున్నారు! మాకు ఆ అర్హత లేదు అని ఇన్ని రోజులు ఆ గుడి నీడ కూడా తాకనివ్వలేదు బాబు! అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ గుడిలోకి వెళ్లి ఆ అమ్మని దర్శించుకునే భాగ్యం ఈ తరం వాళ్లకి నీ వల్ల కలిగింది!" అని అన్నాడు.
పక్కనే ఉన్న మరో వ్యక్తి :-
"బాబు ఈసారి అంగరంగ వైభవంగా జరుపుతాం, మేము జాతర చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం... మీరు తప్పకుండా రావాలి!" అని అన్నాడు.
ఆ మాటలు విన్న శ్యామ్ చిరునవ్వుతో,
"మేం అందరం వస్తున్నాం, మీరు ఏర్పాట్లు చూసుకోండి పెద్దయ్య!" అని వాళ్లకి నమస్కరించాడు.
శ్యామ్ వస్తున్నాడు అని అనడంతో ఏర్పాట్లు మరింత ఉత్సాహంతో చేస్తున్నారు.
శ్యామ్ లోపలికి వెళ్లి అందరినీ చూసాడు.
అప్పుడు ప్రేమ్ :-
"అర్థం అయ్యింది, పది నిమిషాల్లో అందరం తయారై వచ్చేస్తాం!" అని అన్నాడు.
అందరూ చక్కగా గుడికి వెళ్లడానికి సిద్ధం అయ్యారు.
పద్దు మరియు రఘురాం లు వచ్చారు, ప్రేమ్, నరసింహం కూడా వచ్చారు. విశ్వనాథ్ గారు అయితే అందరి కన్నా ముందే బయట ఉన్నారు. అందరినీ కంగారు పెడుతున్నారు మన విశ్వనాథ్ గారు.
శ్యామ్ మాత్రం రుక్మిణీ కోసం ఎదురు చూస్తున్నాడు.
రుక్మిణీ రానే వచ్చింది.
"నుదుటిన మెరుస్తున్న ఆ చిన్న కుంకుమ బొట్టు, కళ్లల్లో దాగున్న కాటుక కాంతి... గుడిలో వెలిగే దీపపు ప్రమిదల్లా ఉన్నాయి. మల్లెపూలు ముడిచిన ఆమె నల్లని కురులు, ఆమె ముఖంపై పడే ఆ చిరునవ్వు... చూసే కొద్దీ చూడాలనిపించే ఒక అద్భుత కావ్యం."
అని శ్యామ్ మనసు పలికింది.
రుక్మిణీ శ్యామ్ దగ్గరకి వచ్చి :-
"శ్యామ్ గారు? ఏం ఆలోచిస్తున్నారు? పదండి వెళ్లాలి!!" అని అంది.
స్వప్నలోకం నుండి మేల్కొన్నాడు మన శ్యామ్.
అందరూ కలిసి గుడికి వెళ్లారు.
అక్కడ శ్యామ్ కోసం ఊరు అంతా ఎదురు చూడటం చూసి ఎంతో కొత్తగా అనిపించింది రుక్మిణీకి.
రుక్మిణీ :-
"మా నాన్నగారి దగ్గర ఎంతో ఆస్తి ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇలా ఈ జనం నీ కోసం ఎదురుచూస్తుంటే అర్థం అవుతుంది... జీవితం లో మనుషుల నుండి పొందే ప్రేమ, అభిమానం గొప్పవి అని," అని అంది రుక్మిణీ.
అప్పుడు శ్యామ్ :-
"అది వాళ్ల గొప్పతనం. మనం ధర్మంగా ఉన్నంతవరకు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు," అని అనగానే ఆ గుంపులోనుండి కొంతమంది కొడవళ్లతో శ్యామ్‌ని చంపడానికి దాడికి దిగారు.
మొదటి వ్యక్తి శ్యామ్ మెడ మీద వేటు వేయబోయాడు కానీ శ్యామ్ కొద్దిలో తప్పించుకుని, రుక్మిణీ చేయి పట్టుకుని పక్కకి లాగాడు. వెనుకనుండి మరో వ్యక్తి వచ్చి శ్యామ్ మీద దాడి చేశాడు. వాడిని కొట్టి వాడి దగ్గర ఉన్న కర్ర లాక్కున్నాడు శ్యామ్.
జనం అంతా పరుగులు తీస్తున్నారు. అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా మారింది.
రుక్మిణీని "ఏం జరిగినా బయటకి రావద్దు" అని చెప్పి శ్యామ్ పైకి లేచాడు.
ఇంకొందరు వ్యక్తులు శ్యామ్ మీదకి రాళ్లు విసిరారు.
మరోవైపు రఘురాం మరియు ప్రేమ్ లు అక్కడ పక్కనే ఉన్న పెద్ద పళ్లెం ఒకటి తీసి వాళ్ల మీదకి విసిరారు. రఘురాం శ్యామ్‌ని ఒక దిమ్మ వెనుకకి తీసుకెళ్లాడు. ప్రేమ్ పద్దు దగ్గర ఉన్నాడు.
మరోవైపు నరసింహం అతని తుపాకీ తీసి గాల్లోకి కాల్చాడు. అయినా సరే వాళ్లు ఆగలేదు. నరసింహం మీదకి దాడికి సిద్ధం అయ్యారు.
చిన్న చిన్న గాయాలు అయిన శ్యామ్, ఆ గుండాలు నరసింహం గారి మీదకి దాడికి దిగడం చూసి వాళ్లని ఒక్కొక్కరిని కొట్టడం మొదలు పెట్టాడు. అతి కష్టం మీద ఏదోలా నరసింహం గారిని విడిపించాడు మన శ్యామ్.
ఊపిరి తీసుకునేలోపే వాళ్ల ముందు దగ్గర దగ్గర ఒక నలభై మంది వేట కొడవళ్లతో శ్యామ్‌ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లని అలా చూసిన శ్యామ్‌కి భయం అనిపించింది. కానీ అక్కడ వేరే దారి లేదు. బ్రతకాలి అంటే పోరాడాలి!
శ్యామ్ గట్టిగా శ్వాస తీసుకుని పక్కనే ఉన్న ఒక గొడ్డలి తీశాడు. అతని పిడికిలితో ఆ గొడ్డలిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. వాళ్లందరూ శ్యామ్‌ని చంపడానికి పరుగులు తీస్తూ శ్యామ్ వైపే వస్తున్నారు.
కానీ ఒక్కొక్కరుగా అందరూ భయంతో అక్కడే పడిపోయి వెనక్కి తిరిగి పారిపోవడం మొదలు పెట్టారు.
శ్యామ్‌కి ఏం అవుతుందో అర్థం కాలేదు. కానీ నేల కంపిస్తుంది.
శ్యామ్ వెనుక నూట యాభై మంది ఊరి జనం ఆ నలభై మంది గుండాల మీదకి ఒక్కసారిగా దాడికి దిగారు. అంత మంది కలిసి ఆ నలభై మందిని చిటికెలో పట్టుకున్నారు. వాళ్లందర్నీ పట్టుకుని చేతులు కాళ్లు కట్టేశారు.
చుట్టూ గుమిగూడిన వాళ్లు వాళ్లని చంపేయాలి అని నిర్ణయించుకున్నారు.
రుక్మిణీ జరిగింది మొత్తం చూసి శ్యామ్ దగ్గరకి రావడానికి భయపడింది. ఒక్కసారిగా అంతా అల్లకల్లోలంగా మారింది.
వాళ్లని ఎవరు పంపించారు అని అడిగితే —
కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పారు. అలాగే శ్యామ్‌కి "ధర్మ వీర" అనే బిరుదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటుంది అని, అది చూసి ఓర్చుకోలేక అలా చేయించారు అని, వాళ్లు కేవలం కిరాయి గుండాలు అని, వాళ్లని విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డారు ఆ గుండాలు.
కానీ వాళ్ల నాయకుడు అయిన శ్యామ్‌కి అపాయం తలపెట్టాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్లని సజీవ దహనం చేద్దాం అన్నారు. జనం అంతా వత్తాసు పలికారు. నరసింహం కి అక్కడ పరిస్థితిని ఎలా సర్దిచెప్పాలో అర్థం కాలేదు.
అప్పుడు శ్యామ్ వాళ్లని ఆపి :-
"వాళ్లు నాకు శత్రువులు కాదు. మీకు నలభై మంది హంతకులు కనిపిస్తున్నారు... నాకు నలభై కుటుంబాలు కనిపిస్తున్నాయి! వెళ్లండి! మీ పిల్లల్ని అన్నంలేకుండా కాకుండా చూసుకోండి!" అని అన్నాడు.
వెంటనే ఆ గుండాలు అందరూ అక్కడే శ్యామ్ కాళ్ల మీద పడి :-
"బాబు మీ ప్రాణాలని హరించాలి అని వచ్చిన వాళ్లకి ప్రాణభిక్ష పెడతావా! నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని చంపాలి అని చూసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి!" అని భావోద్వేగానికి లోనయ్యారు.
వాళ్లని అక్కడి నుండి వెళ్లిపొమ్మన్నారు ఊరి జనం.
మళ్లీ యథావిధిగా ఉత్సవాలు కొనసాగాయి.
కానీ రుక్మిణీ మాత్రం ఇంకా ఆ భయం నుండి తేరుకోలేదు.
శ్యామ్ రుక్మిణీని పట్టుకుని :-
"ఏం కాలేదు లే! ఎందుకు ఏడుస్తున్నావ్! పిచ్చి పిల్ల... ఇంత మంది ఉన్నారు మనకి అండగా, నాకేం అవుతుంది!!!" అని అన్నాడు.
అప్పుడు రుక్మిణీ :-
"ఇది అంతా నా వల్లే కదా! ఆరోజు నేనే మీకు ఇలాంటి పుస్తకాలు రాయమని సలహా ఇచ్చా! అంతా నేనే చేశాను," అని ఇంకా బాధపడుతుంది నింద తనపై వేసుకుని.
అప్పుడు శ్యామ్ :-
"దేవుడా!!! అంతా వెనక్కి వెళ్లి మరీ ఏడవడానికి కారణాలు వెతుకుతున్నావ్!!!" అని నవ్వాడు.
రుక్మిణీ :-
"పో... నీకేం తెలుసు నా భయం! నువ్వు ఎన్ని చెప్పినా సరే నా వల్లే నీకు అన్ని సమస్యలు!" అని అంటుంది.
అప్పుడు శ్యామ్ :-
"అవును నీ వల్లే! ఇంకా గుడిలోకి వెళ్దామా!!" అని అన్నాడు హాస్యంగా.
రుక్మిణీ తన జీవితం లో అలాంటి సంఘటనలు చూస్తానని కలలో కూడా ఊహించుకుని ఉండదు. పాపం ఎన్ని తిప్పలు పడుతుందో శ్యామ్ కోసం.
ఇద్దరూ అమ్మవారిని కలిసి దర్శించుకున్నారు.
ఊరి జనం అంతా శ్యామ్‌కి రాష్ట్ర ప్రభుత్వం "ధర్మ వీర" అనే బిరుదు ఇవ్వబోతున్నారు అని ఎంతో గర్వంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నెల ఇరవై ఆరు తారీఖున ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ శాఖ వెల్లడించింది.
శ్యామ్‌ని కుటుంబ సభ్యులతో రాజధానికి రావాలి అని పిలుపు వచ్చింది!
అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మన రుక్మిణీ మాత్రం ఇంకా ఆ జరిగిన సంఘటన తలుచుకుని ఆందోళన చెందుతోంది.