ఆద్య అలా పలకరించేసరికి సిగ్గుతో చూపు తిప్పుకున్నాడు ముకుంద్. పాపం, అతనికి అమ్మాయిలతో మాట్లాడటం అస్సలు రాదు... పైగా విపరీతమైన సిగ్గు, భయం కూడా. అందుకే ఏమీ పట్టించుకోనట్టు వేరే వైపు చూస్తున్నట్లు నటించాడు.
కానీ పక్కనుండే ముకుంద్‌ని గమనిస్తున్న ప్రణీత్, "ఏంటి బాబూ... ఆ అమ్మాయితో మాట్లాడేందుకు వెళ్తున్నావా? నువ్వా? నువ్వు ధైర్యంగా ఒక అమ్మాయి ముఖం కూడా చూడలేవు. అయినా, ఆ అమ్మాయికి నువ్వు సీటు ఇవ్వగానే నీకేం గుడి కట్టేయదు. నువ్వున్న దరిద్రంలో ఇవన్నీ అవసరమారా నీకు?" అని ఎద్దేవా చేశాడు.
ప్రణీత్ మాటలకు పాపం ముకుంద్‌కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా కూర్చుండిపోయాడు. ఈలోగా ఆద్యకు బస్సులో ఒక ఆవిడ కూర్చోవడానికి చోటు ఇచ్చింది. ముకుంద్ మాత్రం తీవ్ర నిరాశతో ఉండిపోయాడు.
అలా బస్సు కిటికీలోంచి బయటకు చూస్తుండగా... రోడ్డు మీద ఆదికేశవ మనుషులు ఎవరో ఒక వ్యక్తిని కర్రలతో దారుణంగా కొడుతున్నారు.
అది చూసిన ఆద్య కంగారుగా తన పక్కన ఉన్న ఆవిడని, "ఏంటి బామ్మగారూ... పాపం అతన్ని అలా కొడుతున్నారు?" అని అడిగింది.
దానికి ఆవిడ, "ఏంటమ్మాయ్, ఈ ఊరికి కొత్తా ఏంటి? ఆడపిల్లవి... నీకవన్నీ ఎందుకమ్మా, వదిలేయ్," అని కసురుకున్నట్లుగా అంది.
ఆవిడ అలా అనేసరికి ఆద్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. "అది కాదండీ..." అని తను ఏదో చెప్పబోయేలోపే, పక్కనే ఉన్న ఒక పెద్దాయన కలుగజేసుకుని, "ఏం అనుకోకమ్మా... ఆవిడ మా ఆవిడే. వాళ్లు పెద్ద గూండాలు. అయినా, నువ్వు చూస్తే ఏదో గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు... కాలేజీకి ఇలా ఆర్టీసీ బస్సులో వెళ్తున్నావేంటి?" అని అడిగాడు.
అప్పుడు ఆద్య ఎంతో అందంగా నవ్వుతూ... "అయ్యో, అలాంటిదేం లేదు తాతయ్యగారూ... నాకు ఇలా సింపుల్‌గా ఉండటమే కొంచెం ఇష్టం. నిజం చెప్పాలంటే, ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా ఉంటేనే లైఫ్ చాలా బాగుంటుంది తెలుసా," అని బదులిచ్చింది.
ఆ మాటలు విన్న ఆ పెద్దాయన, "బంగారం తల్లివి నువ్వు," అని ఆప్యాయంగా ఆద్య తల నిమిరాడు.