ముకుంద్, ప్రణీత్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక గుడి మెట్ల పక్కన, వదిలేసిన చెప్పుల మధ్య ఆకలితో అల్లాడుతున్న ఒక చిన్న పాప కనిపించింది.
ఆ పాపను చూడగానే ముకుంద్ మనసు కరిగింది. ఏమైనా డబ్బులున్నాయేమోనని జేబులు తడుముకున్నాడు, కానీ అందులో చిల్లిగవ్వ లేదు.
"రేయ్... నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా రా? నేను మళ్లీ ఇచ్చేస్తానులే, ఒక ఇరవై రూపాయలు ఉంటే ఇవ్వు," అని ప్రణీత్‌ని అడిగాడు.
ప్రణీత్ తన జేబులోంచి డబ్బులు తీస్తూ, "బాబూ... నేను కూడా మనిషినేరా. ఆ పాపను చూడగానే నాకూ అదే అనిపించింది," అన్నాడు.
ఇద్దరూ కలిసి దగ్గర్లోని టిఫిన్ షాప్‌లో ఒక టిఫిన్, వాటర్ ప్యాకెట్ కొని ఆ పాపకు ఇచ్చారు. పాపం... ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉందో ఏమో, ఆ పాప ఏమీ మాట్లాడకుండా కవర్ చింపి కంగారుకంగారుగా తినడం మొదలుపెట్టింది.
ముకుంద్ వాటర్ ప్యాకెట్ అందిస్తూ, "నీ పేరేంటి చిట్టీ? మీ అమ్మ వాళ్లు ఎక్కడ?" అని అడిగాడు.
ఆ పాప తినడం ఆపి, వెనక్కి తిరిగి గుడిలోని శివలింగం వైపు చూపిస్తూ... "ఆయనే మా నాన్న," అంది అమాయకంగా.
ఆ మాట వినగానే ముకుంద్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతులో ఏదో అడ్డం పడినట్లయింది.
"మావా... ఇంతకన్నా మనం ఏమీ చేయలేం రా. కనీసం ఆ పాపకి ఒక పూట ఆకలి తీర్చాం. మంచి చేయాలని మనసున్నా, దేవుడు మనకు ఆ స్థోమత ఇవ్వలేదు," అని ప్రణీత్ దీనంగా అన్నాడు.
"నా దగ్గరే గనక డబ్బు ఉంటే... ఇలాంటి వాళ్లందరికీ హెల్ప్ చేసి, వాళ్లు బ్రతకడానికి ఒక దారి చూపించాలని ఉంది మావా," అన్నాడు ముకుంద్ బాధగా.
"బాబూ... ఆకాశం నుంచి కిందకు రా. ఒక పాపకు హెల్ప్ చేసి నువ్వేదో అంబానీలా ఫీలైపోకు," అని ప్రణీత్ వాస్తవాన్ని గుర్తుచేశాడు.
వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే... ఎదురుగా ఒక వ్యక్తిని ఆదికేశవ మనుషులు తరుముకుంటూ రావడం కనిపించింది.
అది చూసిన ప్రణీత్ భయంతో, "రేయ్... పదా పారిపోదాం, ఇక్కడ ఉండొద్దు," అన్నాడు.
"ఎందుకు రా?" అంటూ ముకుంద్ ముందుకు చూడగానే, ఆదికేశవ గూండాల చేతిలో దెబ్బలు తింటున్న సత్యమూర్తి (ఆద్య వాళ్ల నాన్న) కనిపించాడు.
అది చూసిన ముకుంద్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సత్యమూర్తిని పట్టుకుని, "ఏంటి సార్... ఏమైంది?" అని కంగారుగా అడిగాడు.
ఈలోగా వెనక నుంచి ఒక గూండా వచ్చి, "తమ్ముడూ... తప్పుకో," అని ముకుంద్‌ని పక్కకు తోశాడు.
"అన్నా... ఆయన మన ఏరియాకు కొత్త. ఆయన ఏం చేశాడో తెలియదు కానీ... దయచేసి ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేయండి అన్నా," అని బతిమాలాడు ముకుంద్.
దూరం నుంచి చెట్టు చాటున దాక్కున్న ప్రణీత్ ఇదంతా చూసి తలపట్టుకుని, "దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు... దేవుడా!" అని గొణుక్కున్నాడు.
ఆ గూండా కోపంగా ముకుంద్ వైపు చూసి, "నీ బాబు నా దగ్గర తాగడానికి చేసిన అప్పు ఇంకా తీర్చలేదు. ఇప్పుడు నువ్వొచ్చి వేరే వాళ్ల గొడవలో జోక్యం చేసుకుంటున్నావా? చూస్కో మల్లా..." అని వార్నింగ్ ఇచ్చాడు.
అయినా ముకుంద్ వినకుండా, "ఆయన ఈ ఏరియాకు కొత్త అన్నా, నా మాట విని వదిలేయ్," అని మళ్లీ అడిగేసరికి... ఆ గూండా బలంగా ముకుంద్‌ను కొట్టి కింద పడేశాడు.
దెబ్బలు తిని కిందపడిన సత్యమూర్తి వెంటనే పైకి లేచి, "తప్పయిపోయింది... ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి," అంటూ ఆ గూండా కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.
అది చూడగానే ఆ గూండా ఈగో శాంతించింది. కిందపడి ఉన్న సత్యమూర్తి తల మీద కాలు పెట్టి, దర్జాగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. రోడ్డు మీద ఉన్న జనమంతా ఇదంతా చోద్యం చూస్తున్నారే తప్ప ఎవరూ ఆపలేదు.
వాళ్లు వెళ్లిపోయాక, అందరి ముందు జరిగిన ఆ ఘోరమైన అవమానానికి సత్యమూర్తి కుంగిపోయి కంటతడి పెట్టుకున్నాడు.