గూండాలు అక్కడినుండి వెళ్లగానే, అందరి ముందు జరిగిన అవమానానికి సత్యమూర్తి కుంగిపోయాడు... కళ్లవెంట నీళ్లు తిరిగాయి.
ముకుంద్ వెంటనే ఆయన్ని పైకి లేపి పక్కనే కూర్చోబెట్టాడు. ముకుంద్‌కు కూడా దవడ మీద గట్టి దెబ్బే తగిలింది. ఇంతలో చెట్టు చాటు దాక్కున్న ప్రణీత్ బయటకు వచ్చి, "ఏమైంది అంకుల్? ఎందుకలా వాళ్లు మీ వెంట పడ్డారు?" అని అడిగాడు.
సత్యమూర్తి మొహం కడుక్కుని జరిగిందంతా వివరించాడు. ఆయన ఏటీఎం నుంచి బయటకు వస్తుండగా... ఆ ఎనిమిది మంది గూండాలు ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని చూసి అసభ్యంగా కామెంట్ చేశారు. అది చూసి కోపం పట్టలేక, వాళ్లు ఆదికేశవ మనుషులని తెలియక సత్యమూర్తి వాళ్లతో గొడవకు దిగాడు.
ఇదంతా విన్న ప్రణీత్ ఆవేశంతో ఊగిపోతూ, "వాళ్లు చేసిన పనికి అడ్డంగా నరికేసినా తప్పు లేదు మావా!" అన్నాడు.
ముకుంద్‌కు ఇందాక ప్రణీత్ 'పారిపోదాం' అన్న మాట గుర్తుకొచ్చి... "ఛీ... ఎదవా!" అని వాడిని తిట్టి, "పదండి అంకుల్, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి నేను వెళ్తాను," అన్నాడు. సత్యమూర్తి వెంటనే తన బైక్ కీస్ ముకుంద్‌కి ఇచ్చాడు.
సత్యమూర్తిని వాళ్ల ఇంటి దగ్గర దింపి, "మీరు లోపలికి వెళ్లండి అంకుల్, నేను బైక్ పక్కన పెట్టి కీస్ ఇచ్చి వెళ్లిపోతాను," అన్నాడు ముకుంద్.
తండ్రిని, ఆయన పక్కన ముకుంద్‌ను దెబ్బలతో చూడగానే ఆద్య కంగారుగా పైనుంచి కిందకు పరుగులు తీస్తూ వచ్చింది. నాన్నకు దెబ్బలు తగిలాయన్న ఆందోళన ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈలోపు లోపలి నుంచి ఆద్య వాళ్ల అమ్మ శారద కూడా కంగారుగా బయటకు వచ్చింది.
"ఏంటి నాన్న... ఏమైంది? ఆ దెబ్బలేంటి?" అని ఆద్య ఆత్రంగా అడిగింది.
గూండాల గురించి చెబితే వాళ్లు కంగారుపడతారని గ్రహించిన ముకుంద్, వెంటనే వెనక నుంచి కలుగజేసుకుని... "చిన్న బైక్ యాక్సిడెంట్ ఆంటీ గారు," అని అబద్ధం చెప్పాడు. అది అర్థం చేసుకున్న సత్యమూర్తి కూడా తడబడుతూ... "అవునమ్మా... యాక్సిడెంట్," అని దాన్ని కవర్ చేశాడు.
అయితే, అక్కడున్న ఆద్యని చూసి ముకుంద్ లోపల ఆశ్చర్యపోయాడు. 'ఏంటి... ఈ అమ్మాయి ఇక్కడుంది?' అని మనసులో అనుకుని, "సరే అంకుల్, రెస్ట్ తీసుకోండి. ఆంటీ... కొంచెం వేడినీళ్ల కాపడం పెట్టండి," అని కీస్ ఆవిడ చేతిలో పెట్టి అక్కడినుంచి వెళ్లిపోబోయాడు.
కానీ శారద అతన్ని ఆపి, "బాబూ... ఆగు. ఆయనని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. మా ఇంట్లో ఏమీ తినకుండానే వెళ్లిపోతావా ఏంటి?" అని ఆప్యాయంగా అడిగింది.
ముకుంద్ మొహమాటపడుతూ, "అయ్యో లేదండీ... ఇంట్లో మా అమ్మ నా కోసం ఉల్లిపాయల పులుసు, చారు చేసింది. అది తినకపోతే వేస్ట్ అయిపోతుంది ఆంటీ. తర్వాత ఎప్పుడైనా వస్తానులే," అని ముందుకు అడుగు వేశాడు.
వెంటనే ఆద్య, ముకుంద్ చెయ్యి పట్టుకుని... "పర్వాలేదులే... ఈ ఒక్కరోజే కదా, భోజనం చేసి వెళ్లు," అంది.
అలా సడన్‌గా ఆద్య తన చెయ్యి పట్టుకునేసరికి ముకుంద్ పల్స్ రేట్ అమాంతం పెరిగిపోయింది. స్లో మోషన్‌లో వెనక్కి తిరిగి ఆద్య వైపు చూశాడు. ఆ తర్వాత ఆమె పట్టుకున్న తన చేతి వైపు చూస్తూ... "సరే," అని చిన్నగా తల ఊపాడు. అతడి చూపు గమనించిన ఆద్య, వెంటనే తన చెయ్యి వెనక్కి తీసేసుకుంది.
ఇంట్లో ఆద్యకు, ముకుంద్‌కు ఒకేసారి భోజనం వడ్డించింది శారద. వడ్డిస్తూనే, "అవునూ... ఇందాక ఆ అబ్బాయి బాగా తెలిసినట్లు మాట్లాడావు. మీకు ముందే పరిచయం ఉందా?" అని ఆద్యను అడిగింది.
దానికి ఆద్య, "అవునమ్మా... ముకుంద్ మా క్లాస్‌మేట్," అని చెప్పింది.
ఆ మాట వినగానే ముకుంద్ తింటున్నవాడల్లా షాక్‌తో ఆగిపోయి, "ఏంటీ... నువ్వు మా క్లాసా?" అని బిగ్గరగా అడిగేశాడు. వెంటనే నాలుక కరుచుకుని, 'అదేంటి... మనసులో అనుకోవాల్సింది బయటకి అనేశానా?' అని లోలోపల కంగారు పడ్డాడు.
ఆద్యకు అతని ప్రవర్తన విచిత్రంగా అనిపించి... "ఏంటి, నిన్న క్లాస్‌లో నన్ను చూడలేదా?" అని అడిగింది.
దానికి ముకుంద్ తడబడుతూ, "లేదు... కానీ, నిన్ను ఇందాక బస్సులో చూశాను," అన్నాడు.
అది విన్న శారద నవ్వుతూ, "ఇది మరీ బాగుంది! ఒకే క్లాస్‌లో ఉంటారు కానీ, ఒకరికొకరు తెలియదా?" అని హాస్యంగా అంది. దానికి ముకుంద్ మొహమాటంగా ఓ చిన్న నవ్వు నవ్వాడు.
ముకుంద్ ఇబ్బంది పడుతున్నాడని అర్థం చేసుకున్న ఆద్య... "అమ్మా, ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు. నాకు కూడా కొంచెం ఎంబరాసింగ్‌గా ఉంది," అని వాళ్ల అమ్మకు మాత్రమే వినబడేలా మెల్లిగా గుసగుసలాడింది.