అక్కడ నాని వస్తున్నాడని తెలిసి, అతని మరదలు రాధ గుమ్మం దగ్గరే ఆత్రంగా ఎదురుచూస్తోంది. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది, నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. నిజానికి రాధకి తన బావ నాని అంటే ప్రాణం, చాలా అభిమానం.
వెనుకనుంచి వాళ్ల నాన్న సత్యరాజు వచ్చి, “ఏంటమ్మా రాధా, ఇక్కడే కూర్చున్నావ్?” అని అడిగాడు.
రాధ కంగారు పడుతూ, “ఏం లేదు నాన్న, ఊరికే అలా...” అని కవర్ చేసుకుంది.
అప్పుడు సత్యరాజు లోపలికి తొంగి చూసి, “ఓయ్! నాని వచ్చే టైమ్ అయ్యింది, వంట పూర్తయ్యిందా?” అని అడిగాడు.
అంతే, లోపలి నుంచి వాళ్ల ఆవిడ (నాని మేనత్త) కయ్యిమంటూ అరిచింది.
“మీ చెల్లి వాళ్ల అబ్బాయి వస్తున్నాడని అంత పొంగిపోతున్నావేంటి! ఏం ఘనకార్యం చేశాడని? ఇంట్లోంచి వెళ్లగొట్టారంట కదా! మీ బావమరిదికి అవసరాలకే మనం గుర్తొస్తాం, ఇప్పుడు ఆయనగారి కొడుకు మనకు తయారయ్యాడు. ఇదంతా మా అత్తగారు ఆడుతున్న నాటకం. చావు ఇంటి నుంచి వచ్చినోడిని తీసుకొచ్చి మన నెత్తిన రుద్దుతోంది!” అంటూ ఒకటే గోల చేసింది.
ఆ మాటలు విన్న సత్యరాజు సర్దిచెబుతూ, “సరేలేవే, పాపం కుర్రాడు ఎక్కడో ఒక్కడే ఉంటున్నాడు. ప్రతీసారీ వాడు రాడు కదా. ఒక్క పూట భోజనం పెడితే ఏమవుతుంది? మన దగ్గర తిండికేం తక్కువ?” అన్నాడు.
అప్పుడే లోపలికి పరుగులు తీస్తూ వచ్చింది రాధ. వాళ్ల అమ్మ రాధను చూసి, “ఆడపిల్ల ఉన్న ఇంట్లో వాడిని రాత్రంతా ఎలా ఉంచుతాం?” అని విసుక్కుంది.
రాధ ఆ మాటలు పట్టించుకోకుండా, తన ఆనందాన్ని దాచుకుంటూ... “అమ్మా... బావ వచ్చాడు!” అని చెప్పింది.
గుమ్మం దగ్గర నిలబడ్డ నాని వాళ్లందరినీ చూసి ఒక చిరునవ్వు నవ్వాడు.
అది చూసి వాళ్ల అత్త వెటకారంగా, “రా నానీ... నీ గురించే మాట్లాడుకుంటున్నాం! చిన్నప్పుడు నన్ను పేరు పెట్టి మరీ పిలిచేవాడివి, ఎంత మర్యాదో నీకు!” అంది.
నాని నవ్వుతూనే, “అయ్యో, నేను లోపలికి రాకూడదత్తా. రాధా... నాకు ఒక టవల్ ఇవ్వవా! బయటే స్నానం చేసి వస్తా,” అన్నాడు.
రాధ వెంటనే “సరే బావా,” అంటూ టవల్ తేబోతుంటే... వాళ్ల అమ్మ సత్యరాజుకు సైగ చేసి, “మీరు వెళ్లి ఇవ్వండి ఆ టవల్,” అని కసిరినట్లుగా అంది.
సత్యరాజు పరిస్థితి అర్థం చేసుకుని, “నానీ పదా, నేను వస్తా! మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది కదా,” అని నానితో పాటు బయటకు వెళ్లాడు. వాళ్లు అటు వెళ్లగానే వాళ్ల అత్త రాధను గట్టిగా హెచ్చరించింది.
“నాని గాడు ఇక్కడి నుంచి వెళ్లేదాకా నువ్వు నోరు మూసుకుని ఉండు. వాడితో అసలు మాట్లాడకు,” అని వార్నింగ్ ఇచ్చింది. రాధకు ఇష్టం లేకపోయినా, తల్లి మాట కాదనలేక వికృతంగా తలాడించింది.
నాని తలస్నానం చేసి లోపలికి రాగానే, నాని, రాధ ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు. రాధను చూసి నాని చిన్నగా నవ్వాడు. బదులుగా రాధ కూడా నవ్వింది.
వాళ్ల అత్త అయిష్టంగానే భోజనం వడ్డించింది. నాని మౌనంగా తింటూనే, ఆ ఇంట్లో జరిగిన సంభాషణలను, తనకైన అవమానాన్ని మనసులోనే ఆలోచిస్తున్నాడు.
అన్నం తిన్న తర్వాత నాని చెయ్యి కడుక్కుని, “మావయ్యా, నేను ఇంకా వెళ్తాను,” అన్నాడు.
సరిగ్గా అప్పుడే బయట పెద్ద ఉరుము ఉరుమింది. గాలి వేగం పెరిగింది. పెద్ద వర్షం పడేలా ఉంది.
సత్యరాజు కంగారుగా, “అయ్యో, ఇంత రాత్రి పూట ఈ వర్షంలో ఎలా వెళ్తావ్ నానీ? పైగా వాతావరణం కూడా బాగోలేదు. నాతో రా, మనం బయట గదిలో పడుకుందాం,” అన్నాడు.
అది విని వాళ్ల ఆవిడ చిరాకుగా ముఖం పెట్టింది. అది గమనించిన నాని నిదానంగా ఇలా అన్నాడు...
“అత్తా! నేను అమ్మమ్మ చెప్పిందని మాత్రమే వచ్చాను. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇంకో విషయం... ఎనిమిదేళ్ల క్రితం 'నేనెందుకూ పనికిరాను' అని మా నాన్న అన్నప్పుడు, నా మీద నాకున్న కోపంతో నేనే ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. నన్ను ఎవరూ గెంటెయ్యలేదు. వస్తా మావయ్యా! బై రాధా,” అని ఓ నమస్కారం పెట్టి, గుమ్మం దాటాడు.
రాధ తట్టుకోలేక వర్షంలోకే పరుగెత్తుకుంటూ వచ్చి నాని చేయి పట్టుకుంది.
“బావా... అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. ఇన్ని సంవత్సరాలు చాలా ఓపికగా ఎదురుచూశాను నువ్వు తిరిగి వస్తావని. ఇప్పుడు...” అని ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయింది. దూరంగా గుమ్మంలో నిలబడి కోపంగా చూస్తున్న వాళ్ల అమ్మను చూసి సైలెంట్ అయిపోయింది. వర్షం అప్పటికే మొదలైంది.
నాని మెల్లగా రాధ చేతిని విడిపిస్తూ...
“నాకు తెలుసు రాధా, నీకు నేనంటే ఇష్టమని. కానీ నేను నిన్ను పోషించలేను. నాకే దిక్కు లేదు, ఇంకా నిన్ను ఎలా చూసుకుంటాను? మీ అమ్మ మాట విను, తను నీ మంచే ఆలోచిస్తోంది,” అని చెప్పి అక్కడి నుంచి బైక్ తీసి వెళ్లిపోయాడు.
రాధ మాత్రం కురుస్తున్న వర్షంలో, చీకట్లో దూరంగా వెళ్లిపోతున్న నానినే చూస్తూ కన్నీళ్లతో ఉండిపోయింది.
బైక్ మీద తడుచుకుంటూ వెళ్తున్న నాని మనసులో ఎన్నో ఆలోచనల సుడిగుండం.
“అసలు నాకంటే ఎందుకింత చులకన అందరికీ? నేను వాళ్ల అమ్మాయి కోసమే అక్కడికి వెళ్లానని ఆవిడ ఎలా అనుకోగలిగింది? ఛీ... అసలు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది రా నానీ!” అని మనసులో తనను తానే నిందించుకున్నాడు.
ఆ బోరు వర్షంలో, ఒంటరిగా తడుస్తూ... గతాన్ని, వర్తమానాన్ని తలుచుకుంటూ అలా ఎక్కడికో వెళ్తూనే ఉన్నాడు నాని.