> "మీ గారాబం వల్లే అది అలా తయారయ్యింది. అయినా మా రోజుల్లో ఇలా చేసేవాళ్లం కాదు అండి మేము. ఎంత పద్ధతిగా ఉండేవాళ్లమో తెలుసా?
ఇంట్లో నుండి కాలు బయట పెట్టేవాళ్లం కాదు. మా అమ్మ ఏం అంటే అదే చేసేవాళ్లం.
పెద్దమ్మాయికి పెళ్లి చేశాం... కానీ ఏం లాభం? మీ గారాబం వల్ల పనులు చేతకాలేదు.
కానీ మిమ్మల్ని ఏం అనలేదు వాళ్లు... నన్నే అంటున్నారు పనులు నేర్పడం చేతకాదు అని..."
అని ఆగకుండా లోపల ఉన్న అన్ని విషయాలు ఒకేసారి బయట పెట్టేసింది సుమతి.
అది మొత్తం ఎందుకు వచ్చిన శోధి రా బాబు అన్నట్టు మొహం పెట్టారు తండ్రి కూతుళ్లు.
అప్పుడు రుక్మిణి విసుగ్గా:
> "అక్కకి పనులు చెప్పలేకపోవడం నీ తప్పు. అలా అని ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవడం ఇంకా తప్పు!
నేను ఏం అన్నా మీ ఇంట్లో పనిమనిషినా?"
అని అంది.
అప్పుడు వాళ్ల నాన్నమ్మ మధ్యలో:
> "సుమతి... వంటగది నుండి ఏదో మాడుతున్న వాసన వస్తుంది ఏంటి?"
అని అంది.
సుమతి:
> "మాడిన వాసనా! నాకేం రావట్లేదు..."
అని అంది.
> "అయ్యో ఏంటి! ఏం అయ్యింది!"
అని వంటగది వైపు జారుకుంది రుక్మిణి ఆ వంకతో.
ఇక్కడ మనకి రుక్మిణికి ముందే ఒక అక్క ఉంది అని, ఆమెకి పెళ్లి కూడా అయ్యింది అని అర్థం అవుతుంది.
ఇంకా రుక్మిణి సంగతి తెలిసిందే కదా... ఇంటి దొంగ!
---
మరోవైపు శ్యామ్ మరియు ప్రేమ్ మళ్లీ వాళ్ల వరహాలు గారి ఇంటికి బయలుదేరారు. (వాళ్ల మేనమామ)
బస్‌లో వెళ్తుండగా, నిన్న రుక్మిణి మరియు వాళ్ల బామ్మగారు దిగిన ఆ స్టాప్ వచ్చింది.
శ్యామ్ కిటికీ నుండి బయటకి తొంగి చూసాడు ఆశగా... రుక్మిణి ఏమన్నా వస్తుంది ఏమో అని.
కానీ కనిపించలేదు.
సరేలే అని తన కర్తవ్యంపై దృష్టి పెట్టాడు.
ఆ బుక్ ఎలా అయినా పబ్లిష్ చేయించాలి అని ఎందుకో ఈసారి ఎప్పుడూ లేని సంకల్పం వచ్చింది మన శ్యామ్‌కి.
వాళ్ల మేనమామ ఆ బుక్ పైపైన చదివి:
> "బానే ఉంది రా సుందరం... పబ్లిష్ చేసేద్దాం."
అని శుభవార్త చెప్పాడు.
ఆ మాట వినగానే శ్యామ్‌కి ఎంతో ఆనందంగా అనిపించింది.
నిజానికి ఒక విషయం మీద ఎన్నో రోజుల నిరీక్షణ, సమయం కేటాయిస్తే... దాని ప్రతిఫలం వచ్చేటప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది కదా...
ఆ అనుభూతే ఇప్పుడు మన శ్యామ్‌కి కలిగింది.
మొట్టమొదటి సారి అతని రచన పబ్లిష్ అవ్వబోతుంది అని ఎగిరి గెంతులు వేశాడు.
అప్పుడు వరహాలు:
> "కానీ శ్యామ్... నువ్వు రాసే పుస్తకానికి ముందు మాట ఉండాలి కదా!
అది ఎలా మర్చిపోయావు?
నువ్వు రాసింది పర్లేదు, కానీ వేరే వాళ్లు నీ పుస్తకం చదివి రాస్తే చదివేవాళ్లకి నమ్మకంగా ఉంటుంది.
కంగారు ఏం లేదు... చక్కగా రాయించి తీసుకురా.
మంచి ముహూర్తం చూసి పబ్లిష్ చేద్దాం."
అని అన్నాడు.
అలా వాళ్ల మేనమామ మాటలు విని వెనక్కి వచ్చేశాడు మన శ్యామ్.
ఇప్పుడు ముందు మాట ఎవరు రాస్తారు...
అని ఆ రాత్రంతా ఆలోచించాడు.
అప్పుడే శ్యామ్‌కి అతను ఆ వినాయక మండపం దగ్గర చూసిన అమ్మాయి గుర్తొచ్చింది.
ఆ అమ్మాయి వాళ్ల ఊరిలో ఉన్నది ఒకే ఒక్క గుడి.
ఇంకా ఆమె కచ్చితంగా ఈ శనివారం ఆ గుడికి వస్తుంది అని అర్థమయ్యింది శ్యామ్‌కి.
ఇంకా ఆలస్యం చేయకుండా తర్వాతి రోజే ఆ గుడికి బయలుదేరాడు.