మన శ్యామ్ పథకం ప్రకారం ఇప్పుడు రుక్మిణి వాళ్ల ఊరు వెళ్లి, ఆ గోవిందుడి గుడి దగ్గరకి రుక్మిణి వస్తుంది ఏమో అని ఎదురు చూడాలి.
తను ఎదురైతే ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషణ ప్రారంభించాలో ఆలోచిస్తూ బయలుదేరాడు. ప్రేమ్‌ని కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు.
అలా వెళ్లే దారిలో ప్రేమ్‌కి ఆ రోజు వినాయక మండపంలో చూసిన ఆ అమ్మాయి గురించి చెప్పాడు. తన కోసమే ఆరోజు ఆ మండపానికి వెళ్లానని అన్నాడు.
అప్పుడు ప్రేమ్:
> "సరిపోయింది... ఇప్పుడు ఆ ఊర్లో ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావ్ అన్నమాట!"
అని అంటాడు.
అప్పుడు శ్యామ్:
> "ఏమో... కలుస్తానో లేదో తెలీదు. కానీ తను వస్తుంది అని అనుకుంటున్నాను!"
అని అన్నాడు.
అప్పుడు ప్రేమ్:
> "ఏంటి...! ఆ అమ్మాయి వస్తుందో రాదో తెలీకుండానే వెళ్తున్నామా మనం? ఛీ... బస్ టికెట్‌కి పది పైసలు బొక్క!"
అని అన్నాడు.
అప్పుడు శ్యామ్:
> "పది కాదు రా... ఇరవై పైసలు. తిరిగి ఇంటికి వెళ్లవా ఏంటి?"
అని స్టాప్ వచ్చింది అని పైకి లేచాడు శ్యామ్.
పాపం డబ్బులు పెట్టుకున్న ప్రేమ్‌కి లెక్కలు రాలేదు... అలాంటి షాక్ ఇచ్చాడు శ్యామ్.
---
బస్ దిగి గుడిలోకి వెళ్లారు.
చుట్టూ ఉన్న జనం అక్కడ గుడిలో కనిపడ్డ ప్రతి దేవుని ప్రతిమకి దణ్ణం పెట్టుకోవడం చూసి శ్యామ్ విచిత్రంగా నవ్వాడు.
కానీ శ్యామ్ కళ్ళు మాత్రం ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాయి.
జనం అంతా "గోవిందా... గోవిందా..." అంటూ గుడిలోపలికి వెళ్తుంటే, మన శ్యామ్ మాత్రం వాళ్లకి అడ్డుగా నిలబడి రుక్మిణి కోసం ఎదురుచూస్తున్నాడు.
అప్పుడే హఠాత్తుగా గాలి చాలా చల్లగా వీచింది.
శ్యామ్ హృదయం ఉల్లాసంగా ఒక మధురమైన అనుభూతిని చెందుతుంది.
అదే అనుభూతి మొదటిసారి రుక్మిణిని చూసినప్పుడు కలిగింది. ఇప్పుడు కూడా అదే అనుభూతి...
ఆ గుడిలో ఉన్న స్పీకర్‌లో అప్పుడే ఒక పాట మొదలైంది.
రుక్మిణి రానే వచ్చింది.
స్పీకర్‌లో వచ్చేది లక్ష్మీదేవి పాట.
మన శ్యామ్‌కి మాత్రం ఆ పాట రుక్మిణి అందాన్ని వర్ణిస్తున్నట్టు అనిపించింది. ఆ పాటలో ప్రతి అక్షరం...
పాట lyrics:
కనకమయ చేలము - కమనీయ రూపము
కరుణ కురిపించు ఆ కమల లోచనములు
మందహాసము చిందు మంజుల ముఖము
కుందనపు కాంతులీను కుందరదనము
పద్మముల వంటి ఆ పదయుగళము
భక్తకోటికి ఇచ్చు వరహస్తము!
మైమరచిపోయాడు శ్యామ్...
అతని జీవితంలోనే అది మరచిపోలేని క్షణం.
రుక్మిణి పసుపు రంగు ఓణీలో చాలా అందంగా ఉంది.
అంత మంది లోనూ తను మాత్రమే మన రైటర్ గారి కళ్ళకి కనిపిస్తుంది.
అందుకే ఒక ఆంగ్ల కవి:
> "Men in love adore their lovers as goddesses."
అని అన్నాడు.
ఉదయం కాబట్టి గుడి మొత్తం ఆ సూర్యకాంతికి బంగారం లా పసుపు వర్ణంలో మెరుస్తుంది.
ఆ వెలుగులో రుక్మిణి వెంట శ్యామ్...
చూడడానికి రెండు కళ్ళూ చాలట్లేదు.
స్వయంగా ఆ శ్రీకృష్ణుడు రుక్మిణికి తోడుగా వెళ్తున్నాడు ఏమో అని అనిపించింది.
తనతో పాటే దర్శనం దగ్గరకి వచ్చేశాడు.
తను దేవుడికి దణ్ణం పెట్టుకోవడం చూసి, శ్యామ్ చేతులు కూడా దణ్ణం పెట్టేశాయి...
కానీ దేవుడి మీద భక్తితో కాదు.
రుక్మిణి మీద ప్రేమతో.
పంతులు గారు వచ్చి అర్చన చేసేటప్పుడు:
> "రా అమ్మా రుక్మిణి... లక్షణంగా ఉన్నావ్. ఏం అని అర్చన చేయించమంటావ్?"
అని అడిగారు.
పక్కనే ఉన్న శ్యామ్‌కి అప్పుడే తన పేరు తెలిసింది.
"రుక్మిణి" అని...
అప్పుడు వెంటనే శ్యామ్ మనసు:
> "రుక్మిణి - శ్యామ్"
అని పలికింది.
రుక్మిణి కూడా శ్యామ్‌ని గమనించి:
> "ఏంటి ఈ అబ్బాయి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాడు? చూద్దాం..."
అని గబగబా అక్కడి నుండి బయటకి నడుచుకుంటూ వెళ్తుంది.
వెనకే శ్యామ్ కూడా తన వేగాన్ని సమం చేస్తూ వెళ్తున్నాడు.
అది ఎదురుగా ఉన్న అద్దంలో నుండి గమనించిన రుక్మిణి, హఠాత్తుగా వెనక్కి తిరిగి చూసేసరికి...
అక్కడ శ్యామ్ లేడు!
> "ఏంటి... ఏం అయ్యిపోయాడు?"
అని మనసులో అనుకుంది కంగారుగా రుక్మిణి.
వెనక్కి తిరిగి ఒక అడుగు వేసేసరికి అక్కడ కింద ఉన్న ఒక ముళ్లు తన కాలికి గుచ్చుకుని, రక్తం వచ్చేస్తుంది.
అంతే...
వెంటనే కుంటుకుంటూ పక్కకి వెళ్లి ఆ ముళ్లును తీయడానికి ప్రయత్నిస్తుంది.
కానీ మన రుక్మిణికి ఆ రక్తం చూస్తేనే భయం వేస్తుంది.
కనీసం తన కాలిని చూసుకునేంత ధైర్యం కూడా లేదు.
కళ్ళు మూసుకునే ఉంది ఆ నొప్పితో.
అప్పుడు ఎవరో తన కాలు పట్టుకున్నారు అని స్పర్శ ద్వారా తెలిసింది.
ఒక పెద్దావిడ తన కాలికి ఉన్న ముళ్లును సునాయాసంగా తీసింది.
> "ఏం అమ్మా... నొప్పిగా ఉందా? అది చిన్న ముల్లే, ఏం కాదు..."
అని చిన్నగా నవ్వుతూ చెప్పింది ఆవిడ.
అప్పుడు రుక్మిణి కృతజ్ఞతతో:
> "పిలవకుండా వచ్చి ముళ్లు తీసినందుకు థాంక్స్ అండి..."
అని అనబోయింది.
అప్పుడు ఆవిడ:
> "అయ్యో నాదేం లేదు అమ్మా... అదిగో ఆ కుర్రోడు చెప్తేనే వచ్చా నేను."
అని నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయింది ఆవిడ.
ఆవిడ శ్యామ్‌ని చూపించడం గమనించిన శ్యామ్:
> "ఈవిడ ఏంటి నన్ను చూపిస్తుంది... దేవుడా..."
అని వెనక్కి తిరిగి మొహం తిప్పుకున్నాడు మన శ్యామ్ సిగ్గు మరియు భయంతో.
రుక్మిణి శ్యామ్ దగ్గరకి వద్దాం అనుకుంది.
ఈలోపే పక్కనుండి వాళ్ల స్నేహితులు వచ్చేశారు.
అప్పుడు వాళ్ల స్నేహితురాలు లీల:
> "ఏంటే రక్కూ... మాతో రమ్మంటే మా కన్నా ముందే వచ్చేసావ్!"
అని అంటూనే, రుక్మిణి చేతిలో ప్రసాదం చూసి:
> "ఏంటే... అందరం కలిసే కదా దర్శనం చేసుకుందాం అనుకున్నాం? నువ్వు ఎందుకు ముందే చేసుకున్నావ్?"
అని అడిగింది.
ఆ మాటకి రుక్మిణి సమాధానం చెప్పకుండా బయటకి వెళ్లిపోయింది.