ప్రజ్ఞ రిజెక్ట్ చేసిందన్న బాధలో ఉన్న సుశాంత్ ముఖంలో ఆ డల్‌నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. అది పల్లవి కంటపడక మానలేదు. వాడి ముందు బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ పెట్టినా, సుశాంత్ ఆలోచనలు ఎక్కడో శూన్యంలో ఉన్నాయి.
అది గమనించిన పల్లవి, వాడి పక్కన కూర్చుని అడిగింది. "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావ్?"
"ఏం లేదులే అక్కా..." అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు సుశాంత్.
"ఓవర్ చేయకు! మొన్న నీకు మోషన్స్ అయినప్పుడు ట్యాబ్లెట్ వేసింది కూడా నేనే. నా దగ్గర దాయడానికి నీకేం సీక్రెట్స్ ఉంటాయ్ రా?" అంది పల్లవి నవ్వుతూ.
"ఖాళీగా ఉండి, పనీపాటా లేనోళ్ళు చేసేది అదేగా," ఎగతాళిగా అంది పల్లవి.
"కొంచెం ఆపుతావా! లవ్ కాదు, హార్ట్ బ్రేక్ ఇక్కడ," అన్నాడు పెదవి విరుస్తూ.
ఈసారి పల్లవి గొంతులో కాస్త జాలి. "ఎవరా అమ్మాయి? నిన్ను రిజెక్ట్ చేసిన ఆ మహానుభావురాలు ఎవరురా?"
"ఉందిలే... తన పేరు ప్రజ్ఞ. స్కూల్ టీచర్. చాలా బాగుంటుంది... చాలా మంచిది కూడా." సుశాంత్ గొంతులో ఇంకా ఆరాధన తగ్గలేదు.
"సర్లేరా, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి... లైట్ తీస్కో," అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది పల్లవి.
కానీ సుశాంత్ మనసు దానికి ఒప్పట్లేదు. "ఏమో అక్కా... నాకు తను మాత్రమే కావాలనిపిస్తోంది."
"ఆ అమ్మాయి 'నో' చెప్పేసింది కదరా! తను కాకపోతే, అచ్చం నాలాంటి మంచి అమ్మాయి ఇంకొకతె దొరుకుతుందిలే నీకు. కాస్త వెయిట్ చెయ్, నీకింకా చాలా టైమ్ ఉందిగా," అంటూ తన చేత్తో వాడికి దోసె తినిపించింది.
పల్లవి వెనకాల గోడకున్న వాళ్ల అమ్మ ఫోటోని, ఆ వెంటనే ఎదురుగా ఉన్న అక్కని చూసేసరికి సుశాంత్ మనసుకెందుకో చాలా ఎమోషనల్ అనిపించింది. వాడు పూర్తిగా తినేశాడని నిర్ధారించుకున్న పల్లవి, అసలు రంగు బయటపెట్టింది. "రేయ్, తినేశావ్ కదా! కాస్త ఆ అటక మీద ఉన్న పాత సామాన్లు కిందకి దించు."
'రెండు మంచి మాటలు చెప్పి ముప్పై పనులు చేయించుకుంటుంది. సర్లే, మన అక్కే కదా...' అని మనసులో అనుకుంటూ, "హ్మ్... సరే," అని అటక ఎక్కాడు సుశాంత్.
అక్కడ సామాన్లు సర్దుతుండగా ఓ పాత డైరీ వాడి కంటపడింది. 'ఏంటది? ఏదో డైరీలా ఉందే...' అనుకుంటూ దాన్ని తెరవబోయాడు. సరిగ్గా అప్పుడే వాళ్ల నాన్న జయరామ్ అక్కడికి వచ్చాడు.
"ఏంట్రా? ఈ మధ్య పనికొచ్చే పనులు చేస్తున్నావ్! అందుకేనేమో, బయట వర్షం పడేలా ఉంది," అంటూ సరదాగా అన్నాడు.
అప్పటికే ప్రజ్ఞ రిజెక్షన్ తోనూ, అక్క చెప్పిన పనులతోనూ తీవ్రమైన చిరాకులో ఉన్న సుశాంత్.. చేతిలో ఉన్న డైరీని విసురుగా కిందకి కొట్టాడు. "పని చేసేవాడ్ని చేసుకోనివ్వండి! అసలే విపరీతమైన చిరాకులో ఉన్నా," అంటూ తండ్రి మీద కోప్పడ్డాడు.
కొడుకు ప్రవర్తనకు జయరామ్ షాక్ అయ్యాడు. ఏమీ మాట్లాడకుండా, కిందపడిన ఆ బుక్ ని నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని, మౌనంగా అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న పల్లవి కోపంగా సుశాంత్ దగ్గరికి వచ్చింది.
"ఏంట్రా నీ బిహేవియర్? ఎప్పుడూ లేనిది నాన్న మీద కోప్పడ్డావ్? ఓ అమ్మాయి నీకు 'నో' చెప్పిందని ఇంతలా ఫీల్ అవుతున్నావు కదా... మరి అమ్మ చనిపోయాక నాన్న ఇంకో అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోకుండా మనకోసం బతికాడు. నాన్నది రా ట్రూ లవ్! వెళ్లి ముందు సారీ చెప్పు," అని నిలదీసింది.
పల్లవి మాటలతో సుశాంత్ కి తప్పు తెలిసివచ్చింది. గొంతులో ఏదో అడ్డం పడినట్లుగా, తీవ్రమైన అపరాధభావంతో కిందకి దిగాడు. నాన్నకి ఎలా సారీ చెప్పాలో, అసలు ముఖం ఎలా చూపించాలో అర్థం కాని అయోమయ స్థితిలో నెమ్మదిగా జయరామ్ గదిలోకి అడుగుపెట్టాడు.
అక్కడ జయరామ్ మంచం మీద కూర్చుని ఆ డైరీనే చదువుతున్నాడు. కోపంలో తండ్రిని మాట అనడం అయితే వచ్చేసింది కానీ, సారీ చెప్పడం మాత్రం కొడుక్కి రావడం లేదు. తడబడుతూ "నాన్న..." అని పిలిచాడు.
ఆ పిలుపుకు తలెత్తి చూసిన జయరామ్ గొంతులో కోపం లేదు, అంతులేని విషాదం ఉంది. "నన్ను అన్నావని కాదురా నా బాధ... అది మీ అమ్మ డైరీ. దాన్ని నువ్వు అలా నేలకేసి విసిరికొట్టేసరికి... మనసు చాలా కష్టమనిపించింది."
ఆ మాటలకు సుశాంత్ గుండె పగిలినంత పనైంది. కళ్లలోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఒక్క మాట కూడా మాట్లాడలేక, వెనక్కి తిరిగి కళ్లు తుడుచుకుంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు.
కొడుకు వెళ్లిన వైపే కాసేపు చూసిన జయరామ్, నిట్టూరుస్తూ ఆ డైరీని జానకి ఫోటో దగ్గర పెట్టాడు.
"నీ కొడుకు ఏమవుతాడో నాకైతే అర్థం కావట్లేదు జానకి. నువ్వుంటే బాగుండేది. కనీసం వాడిని గట్టిగా ఒక్క మాట కూడా అనలేకపోతున్నాను... బహుశా నా పెంపకంలోనే లోపం ఉందంటావా?" ఫోటోలో చిరునవ్వుతో ఉన్న భార్యతో, భారమైన గుండెతో మాట్లాడుకున్నాడు.