ఏదో అడిగేయాలన్న ఆవేశంతో చాలా జోరుగా ఆద్య దగ్గరికి బయలుదేరాడు ముకుంద్. కానీ తీరా ఆమె దగ్గరికి వెళ్లేసరికి తన పక్కన ప్రణీత్ లేడని గ్రహించాడు. (ప్రణీత్ తోడుంటే ముకుంద్‌కు కొండంత ధైర్యం వస్తుంది).
వెనక్కి తిరిగి, "రేయ్... దగ్గరికి రారా," అని బతిమాలుతున్నట్లుగా సైగ చేశాడు.
కానీ ప్రణీత్ మాత్రం, "నేనెందుకు రావాలి? నీకు ధైర్యం ఎక్కువే కదా... మంచి స్పీడ్‌లో పోయావు, కానివ్వు," అని హ్యాండ్ ఇచ్చాడు.
తీరా తన దగ్గర నిలబడి వెనక్కి సైగలు చేస్తున్న ముకుంద్‌ను చూసి, "ఏంటి ముకుంద్... ఇలా వచ్చావు?" అని ముఖంలోకి చూస్తూ క్యాజువల్‌గా అడిగింది ఆద్య.
ముకుంద్ మాత్రం ఆమె కళ్లలోకి చూడలేక కిందకు చూస్తూ... "అంటే... అది... ఏమీ లేదు. కొంచెం సైడ్ ఇస్తే అటు పోతాను," అని తడబడుతూ అన్నాడు.
అప్పుడు ఆద్య నవ్వుతూ, "అంత కష్టపడకు... ఐ కెన్ అండర్‌స్టాండ్. నువ్వు ఎందుకొచ్చావో నాకు తెలుసులే," అంది.
ఆ మాట వినగానే ముకుంద్ మనసులో ఆనందంతో ఉప్పొంగిపోతూ, చిన్నగా నవ్వుతూ తల పైకెత్తే లోపే... "ఇదిగో... ఇలా వెళ్లిపో," అని దారి చూపించింది ఆద్య.
అది వినగానే ముకుంద్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. 'ఏంటీ... నీకు ఇలా అర్థమైందా?' అని మనసులో బాధపడుతూ, "సరే," అని పక్కనుంచి క్లాస్ బయటకు వెళ్లిపోయాడు.
అతను నడుస్తున్న విధానాన్ని చూసి ఆద్య ప్రణీత్‌ని అడిగింది, "ఏంటి, నీ ఫ్రెండ్ అలా నడుస్తున్నాడు?"
దానికి ప్రణీత్, "ఏమో... నాకు తెలీదు, కాలు బెణికి ఉంటుంది," అని నిర్లక్ష్యంగా చెప్పేసి తను కూడా బయటకు వెళ్లిపోయాడు.
సాయంత్రం:
ఆద్య తన కొత్త ఫ్రెండ్ సత్యతో కలిసి బస్సు కోసం వెయిట్ చేస్తోంది. కానీ మాటిమాటికీ వెనక్కి తిరిగి ఎవరికోసమో ఆత్రంగా చూస్తోంది.
అది గమనించిన సత్య, "ఏంటి ఆద్యా... ఎవరి కోసం చూస్తున్నావు?" అని అడిగింది.
అప్పుడు ఆద్య కంగారుగా తడబడుతూ... "ఏ... ఏమీ లేదు, మన కాలేజ్ ఆర్కిటెక్చర్ బాగుంది కదా అని చూస్తున్నా," అని కవర్ చేసింది.
దానికి సత్య నవ్వుతూ, "బాగుంటుంది... బాగుంటుంది. ఎందుకు బాగోదు? తరతరాలుగా ఎంతోమంది కట్టిన సప్లీ ఫీజులవి... ఆ మాత్రం ఉండాలిగా మరి," అని సెటైర్ వేసింది.
అలా సత్య అంటుండగానే, వెనక నుంచి ముకుంద్ మాటలు వినిపించాయి. 'హమ్మయ్య... ఇంటి దాకా ఒక తోడు దొరికినట్టే,' అని మనసులో ఊపిరి పీల్చుకుంది ఆద్య.
బస్సు రాగానే ఎక్కబోతూ, ముందు ఆద్యను ఎక్కనిచ్చాడు ముకుంద్. ఆద్య చిన్న చిరునవ్వుతో బస్సెక్కి, వెనక్కి వెళ్లి ఓ సీట్లో కూర్చుంది. ఆమె పక్కన ఒక సీటు ఖాళీగా ఉంది. ముకుంద్ మాత్రం కొద్దిగా దూరంలో నిలబడి ఉన్నాడు.
'అవును, ముకుంద్‌కి కాలు బెణికింది అన్నారు కదా...' అని గుర్తుకొచ్చి, ముకుంద్‌ను తన పక్కన కూర్చోమందామని అనుకుంది ఆద్య.
కానీ, 'ఇప్పుడు ముకుంద్‌ని ఎలా పిలవాలి? కొంచెం గట్టిగా పిలిచానంటే మిగతా వాళ్లు ఏమనుకుంటారో... అయినా ఒక అబ్బాయి, అందులోనూ సేమ్ క్లాస్... నా పక్కన కూర్చుంటే రేపు క్లాస్‌లో రకరకాలుగా అనుకుంటారేమో,' అని ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసింది.
అలా తను పిలుద్దామా వద్దా అని ఆలోచించే లోపే... ఒక ముసలావిడ వచ్చి తన మనవడిని ఆద్య పక్క సీట్లో కూర్చోబెట్టింది.
అది చూసి ఆద్య కొంచెం చిరాకుగా, "అమ్మా... ఇక్కడ మా ఫ్రెండ్ కూర్చోవాలి," అని అనేసింది.
సరిగ్గా ఆ మాటలు విన్న ప్రణీత్, "ఓహో... నన్నే కూర్చోమంటుందేమో! కొంచెం దగ్గరికి వెళ్దాం," అనుకుంటూ ఉత్సాహంగా ఆద్య సీటు దగ్గరికి వెళ్లాడు.
ఆద్య మాటలకు ఆ బామ్మగారు, "సరేనమ్మా," అంటూ ఆ చిన్న పిల్లాడిని వెనక్కి రమ్మంది.
కానీ అక్కడికి వచ్చిన ప్రణీత్‌ని చూసిన ఆద్య, కవర్ చేస్తూ... "పర్లేదులే బామ్మగారూ... వీళ్లకి నిలబడటం అలవాటేలే, బాబునే కూర్చోనివ్వండి," అనేసింది.