Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ప్రేమ కావ్యం — ఆఖరి సంవత్సరంలో ఒక సాయంత్రం
సాయంత్రం సమయం.
కాలేజీ పూర్తయి, విద్యార్థులంతా ఒక్కొక్కరుగా ఇళ్లకు బయలుదేరుతున్న వేళ... రామ్, విజయ్‌లు తమ కాలేజీ బస్‌స్టాప్ దగ్గర నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.
ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. చల్లటి గాలి మెల్లగా వీస్తుండగానే... చిన్న చిన్న వర్షపు చినుకులు నేలపై పడటం మొదలయ్యాయి.
విజయ్ ఎప్పటిలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని చూపులు మాత్రం ఎప్పుడూ లాగే ఎక్కడో దూరంగా ఉన్నాయి.
అంతలో పక్క నుంచి ఎవరో పరుగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది.
వర్షం నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ వస్తున్న స్పందన... అప్పటికే సగం తడిసిపోయింది. చేతిలోని బ్యాగ్‌ను జాగ్రత్తగా పట్టుకుని, ఊపిరి పీల్చుకుంటూ బస్‌స్టాప్‌లోకి వచ్చి నిలబడింది.
అనుకోకుండా...
ఆమె విజయ్ పక్కనే వచ్చి నిలబడింది.
విజయ్ మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏదో ఒక క్షణంలో పక్కకు తిరిగి చూశాడు.
అదే సమయంలో స్పందన కూడా అతని వైపు చూసింది.
ఇద్దరి కళ్లూ కలిశాయి.
ఆ ఒక్క క్షణం...
విజయ్‌కి చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆగిపోయినట్టుగా అనిపించింది.
వర్షపు చినుకుల శబ్దం వినిపించడం లేదు. పక్కనే వెళ్తున్న వాళ్లు కనిపించడం లేదు. బస్సుల హారన్‌లు కూడా వినిపించడం లేదు.
అతని కళ్ల ముందు కనిపిస్తున్నది ఒక్క స్పందన మాత్రమే.
ఏం మాట్లాడాలో తెలియదు.
ఎలా మాట్లాడాలో తెలియదు.
ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న ప్రేమ... ఒక్కసారిగా మాటల కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది.
కానీ విజయ్ పెదవుల నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు.
స్పందన మాత్రం చాలా సహజంగా కళ్లను పక్కకు తిప్పుకుంది.
ఆ చిన్న సంఘటనను గమనించిన రామ్ చిరునవ్వు నవ్వాడు.
“రేయ్ విజయ్... రెండు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నావురా! ఇంకెంతకాలం తనకి నీ మ్యాటర్ చెప్పకుండా ఇలాగే గడిపేస్తావ్?”
విజయ్ వెంటనే రామ్ వైపు చూశాడు.
రామ్ మాట కొనసాగించాడు.
“ఇప్పుడు తను ఒక్కర్తే ఉంది. వాళ్ల అన్నయ్య కూడా పక్కన లేడు. కనీసం ఇప్పుడైనా చెప్పేయ్ రా!”
విజయ్‌కి గుండెల్లో దడ మొదలైంది.
అతను వెంటనే రామ్‌కి దూరంగా వెళ్లి,
“నీకూ దండం పెడతా రా బాబు! లేనిపోని టెన్షన్లు పెట్టకు. నన్ను ఇలా వదిలేయ్!”
అన్నాడు.
రామ్ మాత్రం వదిలే రకం కాదు.
విజయ్ భయాన్ని చూసి మరింత ఆటపట్టిస్తూ,
“నువ్విలా దూరం నుంచి చూస్తూ ఉంటే... తనని ఎవడో ఒకడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. అప్పుడు నువ్వు వాళ్ల పిల్లలతో కూర్చొని... ‘మీ మమ్మీని నేను లవ్ చేసేవాడిని’ అని చెప్పుకోవాల్సి వస్తుంది!”
అని నవ్వుతూ అన్నాడు.
ఆ మాటలు విన్న విజయ్ ఏమీ అనలేదు.
కానీ అతని మనసులో మాత్రం ఒక్క ఆలోచన మెదిలింది.
‘ఒక్కసారి స్పందనని చూడాలి...’
అనిపించింది.
వెంటనే వెనక్కి తిరిగి చూశాడు.
అక్కడ...
స్పందన కూడా విజయ్‌నే చూస్తోంది.
మరోసారి ఇద్దరి కళ్లూ కలిశాయి.
విజయ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు.
భయంతో, సిగ్గుతో వెంటనే తలను పక్కకు తిప్పేశాడు.
రామ్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోలేదు.
స్పందన ఒక్కర్తే ఉందని గమనించి, కావాలనే ఆమెతో మాట కలిపాడు.
“స్పందన! ఏంటి... ఒక్కర్తివే ఉన్నావా?”
అని అడిగాడు.
ఆ మాట వినగానే విజయ్ గుండెల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది.
అతను ఏమీ తెలియనట్టు తలను మరోవైపు తిప్పుకున్నాడు.
స్పందన మాత్రం రామ్ దగ్గరకు వచ్చి,
“అవును రామ్. బస్ ఎక్కేద్దాం అనుకున్నా... కానీ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ ఉంది...”
అంటూ విజయ్ వైపు చూసింది.
విజయ్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
అతని ముఖంలోకి వచ్చిన ఇబ్బందిని దాచుకోవడానికి చిన్నగా నవ్వాడు.
రామ్ వెంటనే ఆ మాటను పట్టుకుని,
“అవును లే... వర్షంలో తడిచిపోతే ల్యాప్‌టాప్ పాడైపోతుంది. అయినా మావాడు నువ్వు ఎప్పుడూ ఒకే బస్ ఎక్కుతారు కదా! కలిసి వెళ్లిపోండి. తోడుగా ఉంటాడు. ఏయ్ రా?”
అంటూ చివర్లో విజయ్ వైపు చూశాడు.
విజయ్ వెంటనే రామ్ వైపు చూశాడు.
ఆ చూపులో ఒక్కటే అర్థం.
‘ఎందుకురా ఇలా ఇరికించావ్?’
అన్నట్టుగా ఉంది.
అప్పుడే స్పందన మెల్లగా,
“అయ్యో... పర్లేదు. అన్నయ్యకి కాల్ చేశా. నేను కార్లో వెళ్లిపోతా. జస్ట్ వర్షంలో తడవకుండా ఉండడానికి ఇక్కడికి వచ్చా.”
అని చెప్పింది.
ఆమె ఆ మాట చెప్పిందో లేదో...
అంతలోనే బయట నుంచి ఓ కారు హారన్ వినిపించింది.
స్పందన ఒక్కసారిగా ఆ వైపు చూసింది.
అది తన అన్నయ్య కారు.
అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రామ్, విజయ్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
స్పందన మాత్రం కాస్త కంగారుగా,
“సరే రామ్... బై!”
అని చెప్పి, విజయ్ వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయింది.
విజయ్ ఆమె వెళ్లిపోతున్న వైపు చూస్తూనే ఉన్నాడు.
ఆమె కారు క్రమంగా దూరమవుతున్న కొద్దీ అతని ముఖంలో ఉన్న ఆశ కూడా మెల్లగా తగ్గిపోయింది.
కొన్ని క్షణాల తర్వాత...
విజయ్ కోపంగా రామ్ వైపు తిరిగాడు.
“నువ్వేం అన్నా బ్రోకర్‌వా రా? మమ్మల్ని ఇద్దరినీ కలపడానికి! ఫస్ట్ ఇంప్రెషన్ ఏ లేకుండా చేసేశావ్! దరిద్రుడా!”
అన్నాడు.
రామ్ కూడా తన తప్పేమీ లేదన్నట్టుగా,
“నన్నంటావేంటి? ఎప్పుడూ ఒకే బస్ ఎక్కుతారు కదా! సడన్‌గా వాళ్ల అన్నయ్య కారేసుకొస్తాడని నేను ఏం కలగన్నానా?”
అని సమాధానం ఇచ్చాడు.
విజయ్ ఒక నిట్టూర్పు విడిచాడు.
“కదా! మరి బొంగులో సలహాలు ఇవ్వకు. పద... ఆటోలో పోదాం.”
అన్నాడు.
ఇద్దరూ అక్కడి నుంచి ఆటో వైపు నడిచారు.
కానీ విజయ్ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది.
స్పందన నిలబడిన ఆ బస్‌స్టాప్ దగ్గరే...
ఆమె తన వైపు చూసిన ఆ రెండు క్షణాల దగ్గరే...
---
అలా...
విజయ్‌కి తన మనసులోని ప్రేమను చెప్పుకునే మరో మంచి అవకాశం చేజారిపోయింది.
మనసుకు నచ్చిన అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేయడం ఎవరికైనా ఒక పెద్ద సవాలే.
కానీ మాటలకంటే మౌనాన్నే ఎక్కువగా ఇష్టపడే విజయ్ లాంటి మితభాషికి అది మరింత కష్టం.
ఎన్నో సంవత్సరాలుగా స్పందనను ప్రేమిస్తున్నాడు.
ఆమెను చూస్తూనే ఉన్నాడు.
ఆమెతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాడు.
కానీ ఇప్పటివరకు ఆమెతో ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు.
ఇప్పుడు...
వాళ్ల కాలేజీ జీవితంలో చివరి సంవత్సరం.
చివరి సంవత్సరం కూడా చివరి దశకు చేరుకుంది.
మరి తన మనసులో దాచుకున్న ఆ ప్రేమను విజయ్ ఎప్పుడు బయటపెడతాడు?
అసలు...
విజయ్ తొలిసారి స్పందనను ఎప్పుడు చూశాడు?
ఆమెను చూసిన మొదటి క్షణంలోనే అతని మనసులో ఏం జరిగింది?
వాళ్ల కథ అసలు ఎలా మొదలైంది?
విజయ్‌కి స్పందనపై ప్రేమ ఎప్పుడు మొదలైంది?
ఆ ప్రేమ ఇన్ని సంవత్సరాలు ఎలా పెరిగింది?
మరి చివరికి...
విజయ్ తన ప్రేమను స్పందనకు చెప్పగలడా?
లేక తన మనసులోనే దాచుకుని మిగిలిపోతాడా?
అసలు...
విజయ్ స్పందనకి ప్రపోజ్ చేస్తాడా?
అదే మన “ప్రేమ కావ్యం”.
విజయ్–స్పందనల ప్రేమకథ అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే...
కథను మొదటి సంవత్సరానికి వెనక్కి తీసుకెళ్లాలి...
అక్కడే మొదలైంది ఈ ప్రేమ కావ్యం.
PREMA KAVYAM
By vijay
Published: August 22, 2026 at 4:10 PM
Your input calibrates the database for others.
Ready to play...