Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
"ఏంటి సత్య... టికెట్స్ కూడా బుక్ చేసేశాను, వస్తున్నావా లేదా?" అని చాలా నిరాశగా అడిగింది ఆద్య.
సత్య అవతలి వైపు నుండి, "ఇంట్లో ఈరోజు ఎక్కడికీ వెళ్లొద్దన్నారే... నేను వెళ్తానని మొండికేస్తే, వచ్చే వారం అన్నవరం వెళ్దాం అంటున్నారు," అంది.
"అదేంటి? మీ ఇంట్లో సినిమాకి వెళ్తున్నామని చెప్పలేదా?" ఆశ్చర్యంగా అడిగింది ఆద్య.
"మీ ఇంట్లో వాళ్లు నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఆద్యా... అయినా సినిమాకి వెళ్తున్నానని మీ ఇంట్లో చెప్పడానికే నువ్వు భయపడ్డావు, అలాంటిది మా ఇంట్లో నేనెలా చెప్తానే..." అంది సత్య.
అది విన్న ఆద్యకు విసుగొచ్చి, "సరే... నువ్వు రాకపోతే నేను మాత్రం ఎలా వెళ్తానులే... బాయ్," అని ఫోన్ కట్ చేసింది.
అలా డల్ ఫేస్‌తో బాల్కనీలోకి వచ్చి మొక్కలకు నీళ్లు పోస్తూ నిలబడింది.
సరిగ్గా అదే సమయానికి కింద రోడ్డు మీద ప్రణీత్, ముకుంద్ వాళ్ల ఇంటికి రావడం కనిపించింది.
"రేయ్ ముకుంద్... రారా, గ్రౌండ్‌కి వెళ్దాం. క్రికెట్ మ్యాచ్ ఉంది," అని పిలిచాడు ప్రణీత్.
"రేయ్, నా దగ్గర బెట్ కట్టడానికి డబ్బుల్లేవురా. నువ్వు వెళ్లి ఆడుకో, నేను రాను," అన్నాడు ముకుంద్.
వీడిని ఎలాగైనా ఒప్పించాలని ఆలోచించిన ప్రణీత్, "సరేలే... నువ్వు మ్యాచ్‌కి రా, నీ బెట్ డబ్బులు కూడా నేనే కడతాను," అన్నాడు.
ఆ మాట వినగానే ముకుంద్ ఇంట్లోంచి స్పీడ్‌గా బయటకు వచ్చేసి, "పద మావా... ఆ టీమ్ వాళ్లు నా బ్యాటింగ్ దెబ్బకు చుక్కలు చూడాల్సిందే," అన్నాడు కాలర్ ఎగరేస్తూ.
"ఇందాక రానన్నావు?" అని ప్రణీత్ అడగ్గా, "నా బెట్ నువ్వే ఇస్తా అన్నావుగా," అని అమాయకంగా బదులిచ్చాడు ముకుంద్.
వీళ్ల సంభాషణ వింటున్న ఆద్యకు తెలియకుండానే నవ్వొచ్చేసింది. బాల్కనీలో ఉన్న ఆమెను గమనించిన ప్రణీత్, ముకుంద్‌ను తట్టి... "ఏంట్రా... క్లాస్‌లోనే అనుకుంటే, ఇప్పుడు బాల్కనీల మీద నుంచి కూడా లైన్ వేస్తోందేంటి?" అని ఆటపట్టించాడు.
మరోవైపు ఆద్య చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ ముకుంద్‌కు 'హాయ్' అని సైగ చేసింది. ముకుంద్ కూడా తడబడుతూనే తిరిగి 'హాయ్' అని బదులిచ్చాడు.
వెంటనే ఆద్య లోపలికి వేగంగా పరిగెత్తింది. అది చూసిన ప్రణీత్, "అయ్యబాబోయ్... ఏంటి, మేడమ్ గారికి సిగ్గెక్కిందా?" అన్నాడు నవ్వుతూ.
కానీ ఆద్య సిగ్గుపడి వెళ్లలేదు, కంగారుగా ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి పరిగెత్తింది.
"నాన్నా... ఫ్రెండ్‌తో కలిసి అలా బయటకు వెళ్లి వస్తా," అని హడావుడిగా చెప్పి, ఆయన సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా బయటకు పరుగుతీసింది.
"ఎవరమ్మా ఆ ఫ్రెండ్?" అని సత్యమూర్తి అడిగేలోపే ఆద్య వెళ్లిపోయింది. తను ఒకవేళ ఆగితే, ఎక్కడ నాన్న పంపించరో అన్న భయం ఆమెది. కూతురు అంత కంగారుగా వెళ్లడం చూసి, ఒక తండ్రిగా ఆందోళనతో సత్యమూర్తి కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూశాడు.
అక్కడ ఆద్య పరుగుపరుగున ముకుంద్ దగ్గరకు వెళ్లడం ఆయనకు కనిపించింది.
ఆద్య వాళ్ల దగ్గరకు వచ్చేసరికి బాగా అలిసిపోయి, రొప్పుతూ... "ఏంటి ముకుంద్... ఏమైనా పని మీద వెళ్తున్నావా?" అని అడిగింది.
అప్పుడు ముకుంద్, "లేదు... జస్ట్ ఆడుకోవడానికి... అంతే..." అని తడబడుతూ చెప్పాడు.
Shunyam
By Storytravel
Published: March 5, 2026 at 2:26 AM
Your input calibrates the database for others.
Ready to play...