Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
సంక్రాంతి సెలవులు ముగిశాయి. పల్లెటూరి పచ్చదనాన్ని, ఆత్మీయతలను వదిలి మురళీకృష్ణ మళ్లీ పట్నం చేరుకున్నాడు. రెండు రోజుల క్రితమే ఒక ఆన్‌లైన్ ఆర్డర్ వచ్చింది, కానీ దాన్ని ఓపెన్ చేయడానికి మాత్రం అతను ఆదివారం వరకు ఆగాడు. ఎందుకంటే.. ఆఫీస్ టెన్షన్లు, ఫోన్ కాల్స్ లేని రోజైతేనే తన కొడుకు ఆనందాన్ని మనసారా ఆస్వాదించగలడు.
కింద కూర్చుని బాక్స్ ఓపెన్ చేస్తుండగా.. ఇంకా రెండేళ్లు కూడా నిండని తన ఇరవై నెలల ముద్దుల కొడుకు 'మహేంద్ర' (మహి) పరుగు పరుగున వచ్చాడు. నోరు తిరగని అమాయకపు భాషలో "నది.. నది.." (నాది.. నాది..) అంటూ నాన్న ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఆ బాక్స్‌లో ఏముందో నాన్నకంటే ముందే తనే చూసేయాలన్నంత ఆత్రుత ఆ కళ్లలో కనిపిస్తోంది.
నిజానికి మురళీకృష్ణ ఒక ప్రభుత్వ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. బాధ్యతాయుతమైన ఉద్యోగం కావడం వల్ల ఉదయం త్వరగా వెళ్లడం, రాత్రి ఆలస్యంగా రావడం అతనికి అలవాటైపోయింది. అందుకే దొరికిన ఈ కొద్దిపాటి సమయాన్ని కొడుకుతోనే గడపాలనుకున్నాడు.
ఇంతలో మన మహి.. నాన్న చేతిలో ఉన్న బాక్స్‌ని గట్టిగా లాగేసుకున్నాడు. "ఆగు నాన్న.. నేను తీస్తా" అని చెప్తున్నా వినకుండా, ఎక్కడ నాన్న మళ్లీ తీసేసుకుంటాడో అన్న భయంతో ఆ బాక్స్ పట్టుకుని దూరం పారిపోయాడు. ఓ మూలన కూర్చుని, కళ్లలో కోటి దీపాల వెలుగులతో ఆ బాక్స్ తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు.
కానీ, ఆ చిన్ని చేతుల్లో ఆ బాక్స్ నిలవడం లేదు, ఎలా తీయాలి కూడా తెలియడం లేదు. ఓ పది నిమిషాలు కష్టపడి.. కుదరకపోయేసరికి చిన్నగా సిగ్గుపడుతూ, ముద్దుగా నవ్వుతూ వచ్చి మళ్లీ నాన్న చేతిలోనే పెట్టాడు. "తీసి చూపించు" అన్నట్టు సైగ చేశాడు.
మురళీకృష్ణ సరదాగా.. "నా దగ్గర లాక్కున్నావుగా, నేనసలు తీయను పో" అన్నాడు. అది అర్థమై మహి గట్టిగా అరుస్తూ మొండిచేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకి వంటగదిలో ఉన్న భార్య 'మధు' బయటకి వచ్చింది. మొబైల్‌లో సీరియల్స్ చూస్తూ వంట చేయడం ఆమెకో అలవాటు. "కాస్త మెల్లగా ఆడుకోండి బాస్.. ఇక్కడ సీరియల్ లో డైలాగులు అస్సలు వినపడట్లేదు" అంది నవ్వుతూ.
మళ్లీ మహి వైపు చూసి.. "మహి.. నీ అల్లరి ఎక్కువవుతోంది. అల్లరి చేస్తే బయట ఉన్న పిల్లికి నిన్ను ఇచ్చేస్తా, అది నిన్ను పెంచుకుంటుంది" అని బెదిరించింది.
అంతే! మహి భయంతో వేగంగా వచ్చి నాన్న ఒళ్లో దూరి కూర్చున్నాడు. ఆ ముద్దుల ముచ్చట చూసి మధు నవ్వుకుంటూ మళ్లీ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
ఇక మురళీకృష్ణ ఆత్రుతగా ఎదురుచూస్తున్న కొడుకు ముందర బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో.. చిన్నారి పాదాలకు సరిపోయే పసుపు రంగు రబ్బరు చెప్పులు ఉన్నాయి. వాటిపై పిల్లలని ఆకర్షించే అందమైన కార్టూన్ బొమ్మలు ఉన్నాయి. వాటిని చూడగానే మహి ఆనందానికి హద్దుల్లేవు. కిలకిలా నవ్వుతూ ఒక పెద్ద కేక పెట్టాడు. వెనువెంటనే లేచి నిలబడి, ఆ చిన్ని కాళ్లతో వాటిని వేసుకోవడానికి ప్రయత్నించాడు.
"ఉండు నాన్న.. నేనే వేస్తా" అంటూ మురళీకృష్ణ తన చేతులతో ఆ చిన్ని పాదాలకి చెప్పులు తొడిగాడు. ఆ కొత్త చెప్పులు వేసుకుని మహి ఇల్లంతా పరుగు పెడుతూ, నవ్వుతూ తిరుగుతున్నాడు.
ఆ చెప్పుల ఖరీదు కేవలం రెండు వందల రూపాయలే కావచ్చు, కానీ తన కొడుకు మొఖంలో కనిపించిన ఆ కోటి రూపాయల ఆనందాన్ని చూసి మురళీకృష్ణ కళ్లు చెమర్చాయి.
ఊహ తెలియని తన కొడుకు సంతోషాన్ని చూస్తున్న మురళీకృష్ణకి.. ఒక్కసారిగా ఊహ తెలిసిన వయసులో తను చేసిన ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. తన కోసం కష్టపడిన తన నాన్న గుర్తొచ్చాడు. గుండె బరువెక్కింది.. కళ్లలో నీళ్లు తిరిగాయి!
(ఇంకా ఉంది...)
"నాన్నతో నిన్నటి జ్ఞాపకాలు..!!"
By Mahendra Jannu _Mj
Published: July 3, 2026 at 6:30 PM
Your input calibrates the database for others.
Ready to play...