Loading File
Initializing...
Chapter 2
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
సుశాంత్ వయసు ఇప్పుడు 24 సంవత్సరాలు. జీవితంలో ఏం సాధించాలో స్పష్టత లేక, తన స్నేహితుల మ్యూజిక్ బ్యాండ్‌లో కీబోర్డ్ ప్లేయర్‌గా చేరాడు. అలా ఆ బ్యాండ్‌తో కలిసి పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలు.. ఇలా ఎన్నో ఈవెంట్లలో పని చేశాడు. అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునే వాళ్లకి అనుకోకుండా ఒక పెద్ద కాంట్రాక్ట్ దక్కింది.
సుశాంత్ ఇలా మ్యూజిక్ బ్యాండ్‌లో పనిచేయడం వాళ్ల నాన్న జైరామ్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే, సుశాంత్‌కి వాళ్ల అక్క పల్లవి సపోర్ట్ చాలా ఎక్కువ. ఆమె అతన్ని ఒక తల్లిలా ఎంతో గారాబంగా చూసుకునేది. మరోవైపు, కూతురు పెళ్లి ఎలా చేయాలనే తపన జైరామ్‌ను ఎప్పుడూ వేధిస్తుండేది. ఒక మంచి కుర్రాడికి ఇచ్చి ఆమె పెళ్లి చేయాలనేదే ఆ తండ్రి ఆశ.
ఒకరోజు జైరామ్, అతని స్నేహితుడు కలిసి వీధిలోని ఒక అరుగు మీద కూర్చున్నారు. వాళ్లతో పాటు ఇంకొంతమంది పెద్దలు కూడా వచ్చి పక్కనే కూర్చుని, తమ పిల్లల ప్రయోజకత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలో సుశాంత్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఒక పెద్దమనిషి హేళనగా, "ఏమయ్యా జైరామ్, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంకా ఏ పనీ దొరకలేదట కదా! ఇంకెంత కాలం ఇలా స్నేహితులతో జులాయిగా తిరుగుతాడు? మా అబ్బాయి పనిచేస్తున్న కంపెనీలో ఏమైనా రికమండ్ చేయమంటావా?" అన్నాడు. అది విని అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వారు. పాపం జైరామ్‌కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
ఇంతలో ఇంకొక పెద్దమనిషి అందుకుని, "ఏం రాము, మీ అబ్బాయికి ఇంత వయసొచ్చినా బాధ్యత లేకపోతే ఎలాగయ్యా? ఇంకా ఆ అమ్మాయి వెనకే పడుతున్నాడా? వాళ్ల నాన్నతో చెప్పి ఆ అమ్మాయి వీడిని కొట్టించిందట కదా!" అన్నాడు. ఆ మాటలకు జైరామ్ బాధగా లేచి, "వద్దు సార్, వాడేదో ఒక పని చేసుకుంటాడులేండి" అని వాళ్లకు దండం పెట్టి, తలదించుకుని అక్కడినుండి వెళ్లిపోయాడు. అలా వెళ్తున్న జైరామ్‌కు వెనుకనుండి.. "ఈ కాలం కుర్రాళ్లు చెడిపోయారు సార్. అమ్మాయిల వెంట పడటం, ఫ్రెండ్స్‌తో తిరగడం తప్ప ఏ బాధ్యతా ఉండట్లేదు" అనే మాటలు వినిపించాయి. కానీ అవేమీ పట్టించుకోనట్టుగా ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు.
ఇంటికి చేరుకునేసరికి ఉదయం పది గంటలైనా కొడుకు ఇంకా పడుకునే ఉన్నాడని జైరామ్‌కు విపరీతమైన కోపం వచ్చి గట్టిగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు ఉలిక్కిపడి లేచిన సుశాంత్, "ఆపేయ్ నాన్నోయ్!" అని క్యాజువల్ గా అన్నాడు.
"బయట నీ వల్ల తలెత్తుకోలేకపోతున్నానురా!" అని జైరామ్ ఆవేదనగా అన్నాడు.
ఇంతలో బయట సుశాంత్ ఫ్రెండ్స్ బైక్ హారన్ కొట్టారు. ఒకపక్క నాన్న తిడుతున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం ముఖం కూడా కడుక్కోకుండా నిద్ర మొహంతోనే బయటకి వెళ్లిపోయాడు సుశాంత్.
"మీ అమ్మ అడ్డం వస్తోందిరా! వెళ్లు! మళ్లీ ఇంటికే కదా వచ్చేది!" అని ఆ తండ్రి కోపంగా అరిచాడు.
అప్పుడు వెనుకనుండి వాళ్ల అక్క వస్తూ, "పోనీలే నాన్న, వాడు కనీసం బ్రష్ కూడా చేయకుండా వెళ్లాడంటే ఏదో ముఖ్యమైన పనే ఉండి ఉంటుంది" అని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
"ఏం పనులుంటాయమ్మా? ఊరి మీద బేవార్స్‌గా తిరగడం తప్ప!" అని జైరామ్ నిట్టూర్చాడు.
OKA DIARY
By Storytravel
Published: February 26, 2026 at 2:28 PM
Your input calibrates the database for others.
Ready to play...