Loading File
Initializing...
Chapter 7
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
హాస్టల్ కథలు – "ఏదో ఒకటి తినాలి మాయ!"
ఇదిలా ఉండగా...
టెర్రస్ మీద అర్వింద్ ప్రేమకథలు, స్నేహకథలు, యుద్ధకథలు చూస్తూ ఆశ్చర్యపోతుంటే...
హాస్టల్‌లోని మరో రూమ్‌లో మాత్రం ఇంకో మహా సంఘటన నిశ్శబ్దంగా జరుగుతోంది.
ఆ రూమ్‌లో ఉండే నలుగురు మహానుభావులు...
పవన్, బాలు, బాబూరావు, సువార్తరాజు.
వీళ్ల నలుగురి స్నేహం కూడా హాస్టల్‌లో ప్రత్యేకమే.
ఎక్కడికైనా కలిసి వెళ్లడం, కలిసి తిరగడం, కలిసి తినడం...
అలవాటే.
ఆ రోజు కూడా మెస్ నుంచి భోజనం తెచ్చుకుని రూమ్‌లో పెట్టి, ముందుగా స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా తినేద్దాం అనుకున్నారు.
అందుకే...
నాలుగు ప్లేట్లలో భోజనం వడ్డించుకుని రూమ్‌లో పెట్టి, ఒక్కొక్కరుగా బాత్రూమ్‌కి వెళ్లారు.
స్నానం చేసి, ఫ్రెష్‌గా తయారై, మళ్లీ రూమ్‌లోకి వచ్చారు.
రూమ్ మధ్యలో నాలుగు ప్లేట్లు ఉన్నాయి.
నలుగురూ వాటి చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు.
బయట రాత్రి నిశ్శబ్దంగా ఉంది.
ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది.
అందరూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నారు.
కానీ...
పవన్ ముఖం మాత్రం వెంటనే మారిపోయింది.
అసలు మొదటి నుంచే ఆ భోజనం చూసి అతనికి పెద్దగా తినాలనిపించలేదు.
అయినా ఆకలి కోసం ప్రయత్నించాడు.
అలా కూరలో కలుపుతూ ఉండగా...
అతని కంటికి ఏదో కనిపించింది.
మొదట నమ్మలేదు.
మళ్లీ దగ్గరగా చూసాడు.
అది...
ఒక చిన్న పురుగు.
అంతే.
పవన్ ముఖం ఒక్కసారిగా వంకర తిరిగిపోయింది.
అతని కడుపులో ఏదో తిప్పినట్టు
అనిపించింది.
ఒక్కసారిగా ప్లేట్ చేతిలోకి తీసుకుని లేచిపోయాడు.
అతని చర్య చూసి మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు.
పవన్ కోపంగా అన్నాడు.
"ఛీ దీనెమ్మ! ఇది ఎవడు తింటాడ్రా?"
అని అరిచాడు.
తర్వాత ప్లేట్ వైపు చూపిస్తూ,
"మనిషి అన్నవాడు తినడానికేనా ఇవి వండేది?"
అని విసుక్కున్నాడు.
అంతే...
ఆ ప్లేట్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.
పవన్ బయట పడేసిన ఆహారంలో ఉన్న ఆ పురుగు...
దురదృష్టవశాత్తు...
బాలు కంటికి కూడా పడింది.
ఒక్క క్షణం దానివైపు చూసాడు.
మరుసటి క్షణం...
అతని కడుపులో ఏదో గిరగిరా తిరిగినట్టు అనిపించింది.
ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది.
ప్లేట్ కింద పెట్టి నెమ్మదిగా లేచాడు.
"నేను కూడా వెళ్తా రా... తినాలి అనిపించడం లేదు."
అన్నాడు.
అని బయటికి వెళ్లబోతుండగా...
బాబూరావు వెంటనే ఆపేశాడు.
"అదేంట్రా?"
"అసలు ఏం తిన్నావ్ అని వెళ్లిపోతున్నావ్?"
అని ఆశ్చర్యంగా అడిగాడు.
బాలు మాత్రం సమాధానం చెప్పలేదు.
కేవలం ఒక విచిత్రమైన నవ్వు నవ్వాడు.
అది నవ్వో...
బాధో...
అసహ్యమో...
ఎవరికీ అర్థం కాలేదు.
తర్వాత నెమ్మదిగా బయటికి వెళ్లిపోయాడు.
ఇప్పుడు రూమ్‌లో ఇద్దరే మిగిలారు.
బాబూరావు.
సువార్తరాజు.
బాబూరావు కాసేపు తల గోక్కున్నాడు.
"ఏమైంది వీళ్లకి?"
అని అనుకున్నాడు.
అప్పుడు పక్కనే కూర్చున్న సువార్తరాజు వైపు చూశాడు.
ఇక్కడ ఇద్దరు లేచి వెళ్లిపోయారు.
ఒకడు కోపంతో.
మరొకడు విరక్తితో.
కానీ...
సువార్తరాజు మాత్రం ఏమీ జరగనట్టు ప్రశాంతంగా తింటూనే ఉన్నాడు.
అన్నంలో పప్పు కలుపుతున్నాడు.
ముద్దలు పెట్టుకుంటున్నాడు.
అప్పుడప్పుడు నీళ్లు తాగుతున్నాడు.
అంతే.
అది చూసిన బాబూరావుకి మరింత కన్ఫ్యూజన్ వచ్చింది.
"వీళ్లిద్దరూ లేచి వెళ్లిపోయారు."
"ఈడు మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు."
అని అనుకున్నాడు.
సరే...
వాళ్ల సంగతి వాళ్లది అనుకుని...
బాబూరావు కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.
కానీ...
అది నోట్లోకి వెళ్లగానే అతనికి కూడా నచ్చలేదు.
ఏదో విచిత్రంగా అనిపించింది.
అప్పుడే మళ్లీ సువార్తరాజు వైపు చూశాడు.
సువార్తరాజు మాత్రం నవ్వుతూ తింటున్నాడు.
అతని ముఖంలో అసలు బాధ అనే మాటే లేదు.
అంతలో సువార్తరాజు తల ఎత్తి బాబూరావుని చూసి నవ్వుతూ అడిగాడు.
"మాయ..."
"మన వాళ్లు అప్పుడే తినేశారా?"
అన్నాడు సువర్తరాజు.
ఆ ప్రశ్నలో ఏముందో తెలియదు.
కానీ...
ఆ మాట వినగానే బాబూరావు మనసులో ఏదో విరిగిపోయింది.
ఒక్కసారిగా లేచాడు.
తన ప్లేట్ చేతిలోకి తీసుకున్నాడు.
ఏం మాట్లాడలేదు.
ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదు.
నేరుగా బయటికి నడిచిపోయాడు.
ఎందుకు వెళ్లాడో...
అతనికే తెలియదు.
తిండి బాగోలేదని వెళ్లాడా?
పవన్ గుర్తొచ్చి వెళ్లాడా?
బాలు నవ్వు గుర్తొచ్చి వెళ్లాడా?
లేక సువార్తరాజు అంత ప్రశాంతంగా తినడం చూసి భయపడ్డాడా?
అతనికే అర్థం కాలేదు.
కొన్ని క్షణాల్లో రూమ్ ఖాళీ అయిపోయింది.
ఇప్పుడు అక్కడ...
ఒక్కడే మిగిలాడు.
సువార్తరాజు.
అతను నెమ్మదిగా ఇంకో ముద్ద పెట్టుకున్నాడు.
చుట్టూ ఒకసారి చూసాడు.
ఎవరూ లేరు.
తనలో తానే నవ్వుకున్నాడు.
తర్వాత ప్రశాంతంగా అన్నాడు.
> "ఏదో ఒకటి తినాలి మాయా..."
మరో ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.
"లేకపోతే మళ్లీ రాత్రి ఆకలి వేస్తుంది."
ఇంకో ముద్ద.
"అప్పుడు ఇది కూడా తినడానికి ఉండదు కదా!"
అన్నాడు.
అలా అని చెప్పి...
మిగిలిన భోజనం కూడా నెమ్మదిగా ముగించాడు.
బయట హాస్టల్‌లో ఎవరెవరో ఆకలి గురించి ఫిర్యాదు చేస్తున్నారు...
ఎవరెవరో మెస్‌ను తిడుతున్నారు...
మణికంఠ , రుద్రప్రసాద్ టీ కోసం తిరుగుతున్నారు...
కానీ...
ఆ రాత్రి సువార్తరాజు మాత్రం జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్న మనిషిలా ప్రశాంతంగా కూర్చున్నాడు.
"ఆకలి వచ్చినప్పుడు తిండి విలువ తెలుస్తుంది మాయా..."
అని తనలో తానే అనుకుంటూ ప్లేట్ కడగడానికి లేచాడు.
Hostel memories
By Writer_aj
Published: June 23, 2026 at 10:23 AM
Your input calibrates the database for others.
Ready to play...